మీ అసమర్థతను ప్రతిపక్షంపై నెడతారా?

27 Dec, 2018 13:03 IST|Sakshi
మసీదు అభివృద్ధి పేరుతో విడుదల చేసిన చెక్కు వివరాలను వెల్లడిస్తున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి

బాధితుల పక్షాన సమైక్య పోరాటానికి సిద్ధం

మసీదు నిధులంటూ దగా చేశారు

కొండబాబుపై ద్వారంపూడి ఫైర్‌

తూర్పుగోదావరి, కాకినాడ: ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన అసమర్థతను ప్రతిపక్షంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన చేసే తప్పులను ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందని వైఎస్సార్‌సీపీ కాకినాడ సిటీ కో–ఆర్టినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. తుపాను బాధితులకు పరిహారం పంపిణీ విషయంలో నిజంగా అధికారుల తప్పిదమే ఉంటే బాధితుల పక్షాన ఎమ్మెల్యేతోపాటు, కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు తాను సిద్ధమని ద్వారంపూడి ప్రకటించారు. బుధవారం తన కార్యాలయంలోని ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తుపాను బాధితులకు పరిహారం పంపిణీలోను అక్రమాలకు పాల్పడేందుకు వనమాడి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొండబాబు అవినీతి కార్యకలాపాలకు భయపడి అధికారులు సహితం అర్హులైన పేదలకు న్యాయం చేసే విషయంలో వెనుకడుగు వేస్తున్నారన్నారు. వేటకు వెళ్ళిన మత్స్యకారుల బోటు గల్లంతైతే కోస్టుగార్డు, ఓఎన్‌జీసీ సహకారంతో గుర్తించాల్సిందిపోయి కొండబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని విమర్శించారు. సహాయం చేద్దామంటే ప్రతిపక్షం సహకరించడంలేదంటూ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలోను, తుపాన్‌ బాధితులకు న్యాయం చేసే విషయంలోను కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు తాను సిద్ధమని ప్రకటించారు.

మసీదు నిధుల పేరుతో మోసం...
కాకినాడ పెద్దమసీదు అభివృద్ధికి రూ.కోటి నిధులు ఇస్తామంటూ ఎమ్మెల్యే వనమాడి ముస్లింల ను కూడా దగా చేశారని విమర్శించారు. రంజాన్‌ సందర్భంగా జరిగిన ఇఫ్తార్‌ విందులో కలెక్టర్‌ చేతుల మీదుగా రూ.కోటి అభివృద్ధి నిధులు ఇస్తున్నట్టుగా డమ్మీ చెక్కు పంపిణీ చేశారన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు నిధులు విడుదల కాలేదని చెప్పారు. వాస్తవాలను ఆరా తీస్తే జీవో విడుదలైందే తప్ప నిధులు మంజూరు కాలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.  విలేకర్ల సమావేశంలో కాకినాడ పార్లమెంట్‌ జిల్లా మైనా ర్టీసెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ బషీరుద్దీన్, నగర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు అక్బర్‌ అజామ్, రాష్ట్రవాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పెద్ది రత్నా జీ, కార్పొరేటర్లు మీసాల ఉదయ్‌కుమార్, ఎంజీ కే కిశోర్, బీసీ, యువజన విభాగాల అధ్యక్షులు పేర్ల రజనీకుమార్, బలగం ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు