రైతుల నడ్డి విరవడానికే 166 జీవో..

15 May, 2015 14:29 IST|Sakshi
రైతుల నడ్డి విరవడానికే 166 జీవో..

భూ సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 166 జీవోను తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వరూప్ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయని ఆర్డినెన్స్ను రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.  రైతుల నడ్డి విరవడానికే ప్రభుత్వం 166 జీవో చేసిందని, ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అని ప్రశ్నించారు.

రైతులే స్వచ్ఛందంగా భూములిస్తున్నారన్న మంత్రులు ఇప్పడెందుకు భూ సేకరణకు సిద్ధం అయ్యారని విశ్వరూప్ ప్రశ్నించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ జీవోను అడ్డు పెట్టుకుని ఏపీలో లక్షలాది ఎకరాల భూ సేకరణకు సిద్ధమైందన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూను ఇప్పటి కూడా ఏపీ ప్రభుత్వం బయటపెట్టడం లేదని విశ్వరూప్  విమర్శించారు.

కాగా  యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ గత నెల 3న కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌లోని సెక్షన్ 10 (ఎ) (1) ప్రకారం.. ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో 'రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు'ను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా రాజధానిలో భూ సేకరణకు.. 'భూసేకరణ చట్టం-2013'లోని రెండు, మూడు చాప్టర్లలో పేర్కొన్న సామాజిక ప్రభావం అంచనా, ఆహార భద్రతకు సంబంధిత అంశాల నుంచి మినహాయింపు లభించింది.

మరిన్ని వార్తలు