'దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఓటేయండి'

19 Aug, 2017 02:28 IST|Sakshi



నంద్యాల ప్రజలకు ప్రతిపక్ష నేత జగన్‌ పిలుపు
నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజలతో పని ఉంటేనే ఆయన నోటి వెంట వాగ్దానాలు వస్తాయి. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక రాగానే ఆయనకు అభివృద్ధి గుర్తుకొచ్చింది. పేదవాళ్లకు ఇళ్లు కట్టిస్తానన్నారు. పేదలపై ప్రేమతో ఆయన ఈ ఆలోచన చేయలేదు. పేదలకు కట్టించే పక్కా ఇళ్ల పథకంలోనూ సొమ్మును ఎలా దోపిడీ చేయాలో ప్రణాళికలు రచించారు. తక్షణమే తన బినామీకి ఆ పనులు అప్పగించారు. రూ.3 లక్షలు విలువజేసే 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు అంటగట్టాలని నిర్ణయించారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. 


ఈ మూడున్నరేళ్లలో రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేస్తూ అవినీతి పాలన ద్వారా చంద్రబాబు లంచాల రూపంలో రూ.లక్షల కోట్లు సంపాదించారు. ఆ డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొన్నారు. ఇప్పుడు నంద్యాల ప్రజలను కొనడం ఓ లెక్కా అని.. నీ రేటెంత? నిన్ను ఎంతకు కొనాలి? అని అడుగుతున్న దారుణ పరిస్థితులు నంద్యాలలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు చేసే మోసానికి, దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు ఓటు వేయకపోతే.. మళ్లీ మోసం చేయడం కోసం బాబు ఇంటికో మారుతి కారు, కేజీ బంగారం ఇస్తానంటారు.

ఇలా దారుణంగా అధికారం కోసం ఎంతటి వారినైనా వంచించే గుణం ఉన్న చంద్రబాబుకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి..’ అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం పదవ రోజు సాయిబాబా నగర్‌ ఆర్చి నుంచి రోడ్‌షో ప్రారంభమై.. దేవనగర్, వెంకటేశ్వర స్టోర్, పార్కురోడ్‌ సెంటర్, నాగులకట్ట సెంటర్, దేవనగర్‌ మసీదు సెంటర్‌ వరకు సాగింది. సాయిబాబానగర్, దేవనగర్‌ మసీదు సెంటర్‌ వద్ద జగన్‌ మాట్లాడారు. న్యాయానికి అన్యాయానికి.. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలో నంద్యాల ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలిచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..




కళ్లకు గంతలు కట్టి ఇంద్ర లోకం అదిగో అంటారు..
ఎన్నికలు వస్తే చాలు ప్రజల కళ్లకు చంద్రబాబు గంతలు కట్టి అదిగో ఇంద్ర లోకం అంటారు. ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, చానళ్లు ఆహా.. ఓహో అంటూ రాసేస్తాయి. బాబు మాత్రం ఏరు దాటాక తెప్ప తగలేస్తారు. ఇదేమిటని ప్రశ్నించే వారిపై బండలు వేస్తారు. గట్టిగా ఎవరైనా నిలదీస్తే వారిపై ఉన్నవి లేనివి పోగేసి గోబెల్స్‌ ప్రచా రం చేసి.. వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి రాక్షసా నందం పొందుతారు. 2014 ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎన్నో హమీలిచ్చా రు. ఈ హామీలన్నింటినీ విస్మరించారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక రాగానే బాబు కు కాపులు గుర్తుకొచ్చారు. 

టీడీపీకి చెందిన కాపు నేతలను పిలిచి ఆత్మీయ సదస్సు నిర్వహించారు. మైనార్టీలు, కాపులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, బ్రాహ్మణులు, ఆర్య వైశ్యులు అంటూ అందరి ముందుకు వచ్చారు. తన అవసరాల కోసం ఇదివరకు అందరినీ వాడు కుని.. ఆ తర్వాత తోసేశారు. చంద్రబాబు నైజం గురించి తెలిశాక ఆయన మోసం చేయడంలో డిగ్రీ చేశారన్నది స్పష్టమైంది. కులాలు, మతాలు పేరిట మనుషులను వాడుకోవడం.. తర్వాత ఏరుదాటాక తెప్ప తగలేయడం బాబు చేసిన డిగ్రీ. ‘జామాత దశమ గ్రహం’ అంటూ చంద్రబాబు నైజం గురించి అతని మామ ఎన్టీఆర్‌ చాలా చక్కగా చెప్పారు.

పదవి కోసం, అధికారం కోసం ఎందుకిలా గడ్డి తింటున్నావని నాడు ఎన్టీఆర్‌ నిలదీసి అడిగారు. కూతుర్నిచ్చిన తండ్రి లాంటి తనను ఎలా మోసం చేశాడో చూడం డని ఎన్టీఆర్‌ నాడు ప్రజలకు చెప్పుకున్నారు. ఇలా పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి.. ముఖ్యమంత్రి పదవి, ట్రస్టు భవన్‌ లాగేసుకున్న చంద్రబాబుకు ప్రజలో లెక్కా!’’ అని అన్నారు. నంద్యాల ప్రజలు ధర్మం వైపు నిలిచి శిల్పామోహన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.