వివేకానంద రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం

15 Mar, 2019 09:54 IST|Sakshi

ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు

సంతాపం ప్రకటించిన వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, హైదరాబాద్‌:  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అకాల మరణంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటర్‌ వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘వైఎస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీవ్ర విచారకరం. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియచేస్తున్నా.’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వైఎస్సార్‌ సీపీ నేతలు ఆయన అకాల మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ, నగరి ఎమ్మెల్యే రోజా, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద రావు, మాజీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలంగాణ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డిలు తమ సంతాపాన్ని తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ ఓ మంచి నేతను కోల్పోయిందని వరప్రసాద్‌ రావు పేర్కొన్నారు. 

సంతాపం ప్రకటించిన నారా లోకేష్‌
వైఎస్‌ వివేకానంద రెడ్డి అకాల మరణం పట్ల సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడైన వైఎస్‌ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందుల్లో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది.
 

మరిన్ని వార్తలు