ఓట్ల తొలగింపు కుట్రపై ఆందోళన

4 Mar, 2019 16:51 IST|Sakshi
ఓట్లు తొలగింపు అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు భీమవరం తహసీల్దార్‌  కార్యాలయానికి ప్రదర్శనగా వెళుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

 టీడీపీ అక్రమాలపై నిరసన వైఎస్సార్‌ సీపీ నాయకుల ధర్నా

సాక్షి, భీమవరం: రానున్న ఎన్నికల్లో టీడీపీ లబ్ధి పొందేందుకు ఓట్ల తొలగించేందుకు ఆ పార్టీ నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు, బూత్‌ కన్వీనర్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ కార్యాలయం నుంచి కాలినడకన తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఎన్నికల డెప్యూటీ తహసీల్దార్‌ సీతారత్నం, డీటీ వి.బాబాజీకి ఫిర్యాదు చేశారు.

 పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, కోడే యుగంధర్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, కొరశిఖ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో  టీడీపీ అడ్డదారిలో విజయం సాధించడానికి పార్టీకి అనుకూలమైన వారికి రెండు, మూడు ఓట్లు  నమోదు చేయించారన్నారు. ఓటర్ల జాబితాను తమ పార్టీ పూర్తిగా అధ్యయనం చేయగా దాదాపు 7వేలు వరకు డబ్లింగ్, త్రిబ్లింగ్‌ ఓట్లు ఉన్నాయని  వీటిని తొలగించి అర్హులందరికీ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే తహసీల్దార్‌కు  వినతిపత్రం అందజేశామన్నారు. అయితే వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టారో సమాచారం లేదన్నారు.

ఓట్లు తొలగింపు అక్రమాలపై భీమవరం తహసీల్దార్‌  కార్యాలయంలో  ఎలక్షన్‌ డీటీ సీతారత్నానికి ఫిర్యాదు చేస్తోన్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

అక్రమ ఓట్లపై తాము అభ్యంతరం చెప్పడంతో  టీడీపీ నాయకులు కొత్త ఎత్తుగడ వేసి తమను అప్రదిష్టపాల్జేసేందుకు అర్హుల ఓట్లను కూడా తొలగించేందుకు తాము దరఖాస్తు చేసినట్టు వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్ల పేరుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. తమకు తెలియకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తొలగింపులకు సంబంధించి తమకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. అలాగే ఓట్ల సర్వేలో బూత్‌లెవిల్‌ ఆఫీసర్లు కొందరు అధికార టీడీపీ తొత్తులుగా మారి వైఎస్సార్‌ సీపీ ఓట్ల  తొలగింపునకు దరఖాస్తు చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

టీడీపీ దొంగ ఓట్లుతో రిగ్గింగ్‌ చేసి విజయం సాధించడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మరొక కుట్రకు పాల్పడ్డారన్నారు.  తాము ఇప్పటికే ఆధారాలతో ఫిర్యాదు చేసిన డబ్లింగ్, త్రిబ్లింగ్‌ ఓట్లు తొలగించాలని డిమాండ్‌ చేశారు. దీనికి స్పందించిన ఎలక్షన్‌ డీటీ సీతారత్నం మాట్లాడుతూ  ఓట్ల తొలగింపులో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు తొలగింపునకు ఫిర్యాదు చేసిందంటూ  ప్రచారం చేసే బూత్‌ లెవిల్‌ అధికారులపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ కౌన్సిలర్లు గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు (తాతా రాజు), భూసారపు సాయి సత్యనారాయణ, పాలవెల్లి మంగ, వైఎస్సార్‌ సీపీ నాయకులు పేరిచర్ల సత్యనారాయణరాజు, కొప్పరి సత్యనారాయణ, రేవూరి గోగురాజు,విజ్జురోతు రాఘవులు,  కోమటి రాంబాబు, బొక్కా గోపి, వసంతరావు, జలాలుద్దీన్‌బాబా, పెనుమాల నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు