మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం

20 Jan, 2020 04:57 IST|Sakshi
రేపల్లేలో జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి మోపిదేవి. చిత్రంలో మంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, కిలారి రోశయ్య తదితరులు

వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల పునరుద్ఘాటన 

అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా విజయవాడ, రేపల్లెలో భారీ ర్యాలీలు 

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌)/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు, 13 జిల్లాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు పునరుద్ఘాటించారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బీఆర్టీఎస్‌ రోడ్డులో, గుంటూరు జిల్లా రేపల్లెలో భారీ ర్యాలీలు చేపట్టారు. అనంతరం బహిరంగ సభలు నిర్వహించారు. 

చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం 
జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ) నివేదికల ఆధారంగా సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 13 జిల్లాల సమగ్రాభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న కృత్రిమ ఉద్యమాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ తప్ప మరో మార్గం లేదన్నారు. చంద్రబాబు ప్రస్తుతం 29 గ్రామాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు. చంద్రబాబు ఉచ్చులో చిక్కుకోవద్దని రైతులకు పిలుపునిచ్చారు.  
ర్యాలీ నిర్వహిస్తున్న వెలంపల్లి, పార్థసారథి, మల్లాది విష్ణు, జోగి రమేష్‌ తదితరులు 

రైతుల పొట్టగొట్టింది చంద్రబాబే  
ప్రతిపక్ష నాయకులు తప్పుడు రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి హితవు పలికారు. చంద్రబాబు, ఆయన అనుచరులు అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి 4,000 ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు రాజధాని పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ... అమరావతి ఎక్కడికీ తరలిపోవడం లేదని, దీనితోపాటు అదనంగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు రాజకీయ భిక్షగాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నేతలు పూనూరు గౌతమ్‌రెడ్డి, బొప్పన భవకుమార్, దేవినేని అవినాష్, యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సీఎం నిర్ణయానికి మద్దతు ఇవ్వాలి
అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుడు ప్రచారంతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సింది పోయి అబద్ధాలతో పక్కదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పి.నారాయణస్వామి మాట్లాడుతూ... రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు.  కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సింహాద్రి రమేష్, మహమ్మద్‌ ముస్తఫా, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, కావటి మనోహరనాయుడు, చిల్లపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు