‘షార్ట్‌ ఫిల్మ్‌ కోసమే వారిని బలితీసుకున్నారు’

19 Sep, 2018 13:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుతో షార్ట్‌ ఫిల్మ్‌ తీయించాలని 29మంది భక్తుల చావుకు కారణమయ్యారని వైఎస్సార్‌ సీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ నివేదిక..  తప్పంతా భక్తులదే.. మూడ నమ్మకంతో అంతమంది అక్కడికి వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందనటంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ఎన్నుకోవటమే ప్రజలు చేసిన పెద్ద తప్పిదంగా ఆయన అభివర్ణించారు.

కీర్తి ఖండూతి, పబ్లిసిటీ యావ ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడు ఈ ప్రపంచం అంతా వెతికినా కనపడరని అన్నారు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కర ఘాట్‌లో ఎందుకు స్నానం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఫోటేజీలను మాయం చేసి, మూడు సంవత్సరాలు కాలయాపన చేసి తూతూ మంత్రంగా ఒక నివేదికను ఇచ్చారని మండిపడ్డారు.

బాధితులపై బండలేసే పరిస్థితి
అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాదానికి భక్తుల మూడనమ్మకమే కారణమనటాన్ని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తప్పుబట్టారు. ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోకుండా బాధితులపై బండలేసే పరిస్థితి ఉందని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం.. మానవత్వం లేని ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదకను తొక్కిపట్టి కొత్త నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండటం వల్లే కలెక్టర్‌కు మొట్టికాయలు వేసి నివేదికను తొక్కిపట్టారని అన్నారు.

ప్రచార ఆర్భాటం వల్లే 29మంది ప్రాణాలు గాల్లోకి..
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచార ఆర్భాటం వల్లే గోదావరి పుష్కర సమయంలో 29మంది ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. కేవలం కంటితుడుపు చర్యగా మాత్రమే కమిషన్‌ వేశారని అన్నారు. ప్రమాద సమయంలో అత్యవసర వైద్యం అందకపోవటం వల్లే అంతమంది చనిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబే తప్పుచేసి ఎవరి తప్పలేదన్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు