అనిత దళిత ద్రోహి: గిడ్డి ఈశ్వరి

2 Jul, 2017 17:08 IST|Sakshi
అనిత దళిత ద్రోహి: గిడ్డి ఈశ్వరి

విశాఖపట్నం: ఎమ్మెల్యే అనిత దళిత ద్రోహి అంటూ గరగపర్రు ఘటనపై ఆమె ఎందుకు మాట్లాడడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిలదీశారు. ఆదివారం ఇక్కడ జరిగిన  పార్టీ ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని, లోకేష్‌ను, మంత్రి గంటాను ఎవరైనా విమర్శిస్తే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తారు గానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడరా అని మండిపడ్డారు. దళిత, మహిళలు, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతూంటే అనిత ఎందుకు మాట్లాడతలేరని ప్రశ్నించారు. మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ నేతలు విశాఖను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని, భూ దందాలకు మాత్రమే వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని రాష్ట్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఎక్కడ అడ్డుపడుతున్నారో బాబు చెప్పాలని  ప్రశ్నించారు.  టీడీపీ నేతల భూదందాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. లోకేశ్‌కు దమ్ము ఉంటే మీ నాన్న పాలనపై నమ్మకం ఉంటే.. ఈ మూడేళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. వోక్స్ వ్యాగన్ గురించి ఆరోపణలు వస్తే ఆనాడు దివంగత వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. విశాఖ భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సంవత్సరం ఓపిక పట్టండి.. రామన్న రాజ్యం వస్తుంది
 ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి... రామన్న రాజ్యం వస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో టీడీపీ దొంగలు పడ్డారని, విలువైన భూములు దోచేస్తున్నారని ఆరోపించారు. ఈ భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 2019లో వైసీపీదే అధికారం అని, వైఎస్ పధకాలు కొనసాగాలంటే జగన్ సీఎం కావాలని అన్నారు. విశాఖలో ఒక్క కొత్త కంపెనీ రాలేదని, విభజన హామీలు ఎక్కడా అమలు కాలేదని, చంద్రబాబు పెట్టుబడిదారులనే పట్టించుకుంటున్నారు.. గిరిజనులను, సామాన్య ప్రజలను పట్టించుకోవడంలేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు