సర్కార్‌ మొద్దునిద్ర వీడే వరకు... అగ్రిగోల్డ్‌ బాధితుల గర్జన

4 Jan, 2019 02:29 IST|Sakshi

అగ్రిగోల్డ్‌ ఆస్తి గజం కూడా పోనివ్వం: వైఎస్సార్‌సీపీ నేతలు

రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళన

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, ముట్టడి

బాధితుల నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌లు

పోరాటానికి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నేతల స్పష్టీకరణ

నాలుగున్నరేళ్లుగా తమ గోడును పట్టించుకోని ప్రభుత్వ తీరుపై అగ్రిగోల్డ్‌ బాధితులు మరోసారి భగ్గుమన్నారు. సర్కార్‌ పెద్దలు కల్లబొల్లి మాటలతో మాయ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్‌ బాధితులు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్‌ల వద్ద భైఠాయించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారి ఆందోళనలో వెన్నంటి ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎంతో మంది బాధితులు అసువులు బాసినా... మరెందరో ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదంటే ఇది రాక్షస ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. 

సాక్షి నెట్‌వర్క్‌: మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు తమ ఆవేదన వినిపించేలా అగ్రిగోల్డ్‌ బాధితులు గర్జించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితులు ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్‌ల వద్ద బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధిత బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో బాధితులు గుంటూరు కలెక్టరేట్‌ ముట్టడించారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి వేల కోట్ల ఆస్తుల్లో అధిక శాతం అనధికారికంగా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఎవరైనా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేయాలని చూసినా, అక్రమ క్రయ విక్రయాలు నిర్వహించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. వి

జయవాడ లెనిన్‌ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీమంత్రి కె.పార్థసారధి, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తదితరులు పాల్గొన్నారు. 19.70 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులు విలవిలలాడిపోతున్నా.. సర్కార్‌లో కనీస చలనం లేకపోవడం సిగ్గుచేటని వారు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ధర్నా అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రాన్ని అందజేశారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుండా శవాలపై చిల్లర ఏరుకున్నట్లు ఆ సంస్థ కీలక ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తోందని, ఇది రాక్షస ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఒక్క నెలలోనే రూ.1,150కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తారన్నారు. 

కార్యక్రమంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహ పార్కులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బాధితులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి. అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. ధర్నాకు ముందు నగరంలో ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం తదితరుల ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితులు జిల్లా కలెక్టర్‌ కె ధనంజయరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని బాధితులకు భరోసా ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ స్కాం రూ.10 వేల కోట్లు పైనే ఉందన్నారు. ధర్నాలో ఇంకా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన ధర్నాకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వం వహించారు.   

మరిన్ని వార్తలు