జగన్‌ను మట్టుబెట్టేందుకు కుట్ర

28 Oct, 2018 11:43 IST|Sakshi

చంద్రబాబు, డీజీపీ వ్యవహారశైలిపై అనుమానాలు 

ప్రణాళిక ప్రకారమే నిందితుడి పోస్టర్, లేఖ సృష్టి 

 సీఎం, మంత్రులు మానవ మృగాలుగా వ్యవహరిస్తున్నారు 

నటుడు శివాజీకి నాలుగు తగిలిస్తే ‘అపరేషన్‌ గరుడ’ గురించి తెలిసిపోతుంది

  వైఎస్సార్‌సీపీ నేతలు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్‌రెడ్డి 

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మట్టుబెట్టేందుకు ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక రచించుకున్నారని, ఇందుకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టును వేదికగా ఎంచుకున్నారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఇందులో సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ పాత్ర, కుట్ర ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితుడి పోస్టర్, లేఖ సృష్టించారన్నారు. శనివారం వారు కర్నూలులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడపై కత్తితో పొడిచి హత్య చేయాలని చూశారని, పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని వివరించారు. 

వైఎస్‌ జగన్‌కు ఏమైనా జరిగి ఉంటే రాష్ట్రం అల్లకల్లోలం అయి ఉండేదన్నారు. ఆయన శాంతి కామకుడు కాబట్టి పార్టీ శ్రేణులు కేవలం రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపాయన్నారు. ఈ ఉదంతాన్ని పట్టుకొని చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా తానే కాపాడనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ, జనసేన, బీజేపీ కలసి గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి పాలన పెట్టించాలని ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు ఆరోపించడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే పరామర్శించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఆయనపైనే విమర్శలు చేయడం వారి రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో వంగవీటి మోహన్‌రంగా, ఒక అఖిల భారత సర్వీసు అధికారిని చంపారని, అదే విధంగా ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

 ఐదు కోట్ల మంది ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉన్న జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. సినీనటుడు శివాజీకి నాలుగు తగిలించి జైల్లో పెడితే ‘అపరేషన్‌ గరుడ’ స్క్రిప్ట్‌ బయటకు వస్తుందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం సమయంలోనే శివాజీ అమెరికాకు ఎందుకు వెళ్లారని, వెంటనే ఇండియాకు పిలిపించాలని డిమాండ్‌ చేశారు.  

అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా? 
వైఎస్‌ జగన్‌ పబ్లిసిటీ కోసం కత్తితో పొడిపించుకున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక,  ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై బీవై రామయ్య మండిపడ్డారు. అసలు మీరు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో జగన్‌ భిక్షతోనే ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచారనే విషయాన్ని మరచిపోవద్దని హితవు పలికారు. ముక్కూ ముఖం తెలియని బుట్టా రేణుక ఎంపీగా, పత్తికొండలో జెడ్పీటీసీగా ఓడిపోయిన ఎస్వీమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారంటే అది జగన్‌ పుణ్యమేనన్నారు. ఇప్పుడు వారు రూ.కోట్లకు అమ్ముడుపోయి ఆయనపైనే విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు.

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సేవ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్లే ఆ దేవుడు పెద్ద ప్రమాదం నుంచి రక్షించారని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంత్రులు, పోలీసు అధికారులు తమ అధినేత పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కత్తితో పొడిపించుకుంటే పబ్లిసిటీ వస్తుందనుకుంటే టీడీపీ నాయకులే ఆ పని చేయించుకోవాలని సూచించారు. అలిపిరి ఘటనలో గాయపడిన చంద్రబాబును అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరామర్శించారని, అలాంటి హుందాతనం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు.

 జగన్‌ను ఇతర పార్టీల నేతలు పరామర్శిస్తే సీఎం జీర్ణించుకోలేకపోతున్నారని, తిత్లీ తుపానుతో ముడిపెట్టి విమర్శలు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా నేత తోట వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు. అత్యంత భద్రత ఉన్న విమానాశ్రయంలోకి కత్తి ఎలా వెళ్లిందో చెప్పాలని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు ఓటు రూపంలో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు రియల్‌ టైం నాగరాజు, కరుణాకరరెడ్డి, మదారపు రేణుకమ్మ, సయ్యద్‌ ఆసిఫ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు