పోరాటాన్ని ఎంచుకున్న వైఎస్‌ఆర్ సీపీ

3 Oct, 2013 03:13 IST|Sakshi

కొండపి, న్యూస్‌లైన్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ఆర్ సీపీ పోరాటాన్నే మార్గంగా ఎంచుకుందని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ ఆదేశాల మేరకు స్థానిక మండల కార్యాలయం ఎదుట బుధవారం ఆయన నిరాహారదీక్ష చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు నిరాహార దీక్ష చేపట్టినట్లు జూపూడి తెలిపారు. రెండు రోజుల పాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
 
 రాష్ట్ర ప్రజలతో సంబంధం లేకుండా తెలుగు ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చిన చంద్రబాబు, అసమర్థ సీఎం ఇప్పుడు మేలుకుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడి ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉంటే పాలకులు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు.
 
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 16 నెలలు అక్రమంగా జైలులో ఉంచేందుకు కాంగ్రెస్‌తో కలిసి కుట్ర చేసింది చంద్రబాబా కాదా.. అన్ని ప్రశ్నించారు. తెలుగు ఆత్మ గౌరవయాత్ర పేరుతో కొండపిలో పర్యటించనున్న చంద్రబాబును సమైక్యవాదివా.. విభజన వాదివా.. చెప్పాలంటూ ప్రజలు నిలదీయాలని జూపూడి పిలుపునిచ్చారు. రామరాజ్యం అంటే ఏమిటో ప్రజలకు చూపిన వ్యక్తి దివంగత నేత వైఎస్‌ఆర్ అని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. జూపూడికి సంఘీభావం తెలిపిన వారిలో  మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్డారెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి మండలాల పార్టీ కన్వీనర్లు ఉపేంద్ర, బొట్ల రామారావు, చుక్కా కిరణ్‌కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, గాలి శ్రీనివాసులు, రమణారెడ్డి పాల్గొన్నారు.
 
 రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు యాత్ర : గొట్టిపాటి
 అద్దంకి, న్యూస్‌లైన్ : టీడీపీ నాయకుడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం స్థానిక బంగ్లా సమీపంలో బుధవారం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్‌ర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు మినహా మిగిలిన పార్టీలన్నీ రాష్ట్ర విభజకు అనుకూలమేనన్నారు. భాషా ప్రాతిపదికపై ఏర్పాటైన తెలుగు రాష్ట్రాన్ని విభజించేందుకు నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పెద్దలేవరూ సాహసించలేదని గుర్తుచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా తెలంగాణ రాష్ట్రం కావాలని కొందరు ఆందోళన చేసినా ఆయన సమైక్యవాదాన్నే బలపరిచారన్నారు. అప్పట్లో కేంద్రం కూడా విభజన విషయంపై ఏమీ మాట్లాడలేదని గుర్తుచేశారు. మహానేత వైఎస్‌ఆర్ కృషితో రెండు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఓట్లు..సీట్ల కోసం తెలుగు ప్రజలను విడదీయాలని చూస్తోందన్నారు. 63 రోజులుగా సీమాంధ్రలో అన్ని వర్గాలవారు ఉద్యమం చే స్తుంటే కేంద్ర పట్టించుకోకుండా తన పంతం నెగ్గించుకోవాలని చూడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉండి తీరుతుందని గొట్టిపాటి ధీమా వ్యక్తం చేశారు.
 
 సమన్యాయం చేయకుండా విభజన అంటే ఎలా : నూకసాని
 కందుకూరు, న్యూస్‌లైన్ : తండ్రిలా సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఎలా అని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్, పార్టీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నూకసాని బాలాజీ ప్రశ్నించారు. సమైక్యాంధ్ర సాధన కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామితో కలిసి స్థానిక అంబేద్కర్ బొమ్మ సెంటర్‌లో బుధవారం ఆయన దీక్ష చేపట్టారు. వీరికి సంఘీభావంగా మరో సమన్వయకర్త తూమాటి మాధవరావు రిలే దీక్ష చేపట్టారు. సమన్వయకర్తలకు పార్టీ నాయకుడు వైవీ భద్రారెడ్డి దండలు వేసి దీక్షను ప్రారంభింపజేశారు. అనంతరం నూకసాని మాట్లాడుతూ కొందరి రాజకీయ నాయకుల స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారే తప్పా ప్రజల మేలు కోసం కాదని ధ్వజమెత్తారు.
 
 తండ్రిలా రాష్ట్రాన్ని విభజించే ముందు కనీసం సమన్యాయం చేయాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దలకు లేకపోవడం విచారకరమన్నారు. మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి మాట్లాడుతూ రెండు నెలలుగా సీమాంధ్ర ప్రాంతంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై వైఎస్‌ఆర్ సీపీ మొదటి నుంచీ ఒకే మాటపై ఉందని గుర్తు చేశారు. మరో సమన్వయకర్త తూమాటి మాధవరావు మాట్లాడుతూ 1972లో రాష్ట్ర విభజన కోసం ఉద్యమం చెలరేగితే అప్పట్లో మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా అందలమెక్కించి రాష్ట్ర విభజన ఉద్యమాన్ని నీరుగార్చిన సంగతి ఇంకా సీమాంధ్ర ప్రజలు మరిచిపోలేదన్నారు.
 
 కావాలని రాజకీయ నిరుద్యోగులు కొంతమంది పోగై వేర్పాటు వాదాన్ని తెరమీదకు తెచ్చారే తప్పా ప్రజల ఆకాంక్ష కోసం కాదని ధ్వజమెత్తారు. వేర్పాటు వాదం విత్తనాన్ని కేసీఆర్ నాటితే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నీరు పోసి పెంచారని దుయ్యబట్టారు.
 
 కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు పీవీ రమణయ్య, దార్ల కోటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు వసంతలక్ష్మి, వైఎస్‌ఆర్ సీపీ మహిళ నాయకురాలు యనమల మాధవి, యువజన విభాగం మండల అధ్యక్షుడు షేక్ రఫీ, కూనం రామకృష్ణారెడ్డి, ఫజుల్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొల్లూరి కొండయ్య (గ్యాస్), సుదర్శి శ్యామ్, ఇరపని అంజయ్య, జిల్లా నాయకులు కంది అంజిరెడ్డి, వరికూటి కొండారెడ్డి, రామాల శింగారెడ్డి, యజాజ్‌అహ్మద్, నగళ్ల నారయ్య, బాలరాఘవ్‌యాదవ్, పంది కోటేశ్వరరావు, అల్లం రాధయ్య, యాసిన్, కుంచాల ట్రస్ట్ కోటేశ్వరరావు, వెంకటరామిరెడ్డి, నజీర్, రసూల్, వెంకట్రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు