వైఎస్సార్‌సీపీ నేత కొల్లం కన్నుమూత

30 Sep, 2017 02:04 IST|Sakshi

అనారోగ్యంతో తిరుపతిలో తుదిశ్వాస విడిచిన బ్రహ్మానందరెడ్డి

రైల్వేకోడూరు అర్బన్‌: వైఎస్సార్‌ జిల్లా రైల్వేకోడూరు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. చెన్నైలో చికిత్స చేయించుకుని ఇటీవలే తిరుపతిలోని ఆయన స్వగృహానికి వచ్చారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లెలో కొల్లం పెంచల్‌రెడ్డి, మంగమ్మకు ప్రథమ సంతానంగా 1954 జులై 1న బ్రహ్మానందరెడ్డి జన్మించారు. ప్రొద్దుటూరుకు చెందిన పల్లెటి జయరామిరెడ్డి కుమార్తె రమాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతుల ఏకైక కుమార్తె హర్షితరెడ్డికి ఇటీవల వివాహమైంది. బ్రహ్మన్నగా ప్రఖ్యాతి పొందిన బ్రహ్మానందరెడ్డికి ఒక సోదరుడు ఏడుగురు సహోదరిలు ఉన్నారు. 

వైఎస్సార్‌ శిష్యుడిగా.. : పుల్లంపేట మండలంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన బ్రహ్మానందరెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి శిష్యుడిగా ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు. రైల్వేకోడూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్సార్‌ ఉన్నపుడు అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని రెండు పర్యాయాలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులను రెండుమార్లు గెలిపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొరముట్లను కాంగ్రెస్‌ పార్టీలో ఒకమారు, వైఎస్సార్‌సీపీలో రెండుసార్లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. బ్రహ్మానందరెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం రైల్వేకోడూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి పార్టీ కార్యకర్తలకు, బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. 

వైఎస్‌ జగన్‌ సంతాపం
కొల్లం బ్రహ్మానందరెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. బ్రహ్మానందరెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని చెప్పారు.  

మరిన్ని వార్తలు