'బాబుకు ధైర్యం లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు'

12 Mar, 2020 18:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : పల్నాడులో టీడీపీ నేతల దురుసు ప్రవర్తనపై వైసీపీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు నిఘా యాప్‌పై టీడీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను కూడా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్‌విఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. నిఘా యాప్‌పై చంద్రబాబు మాట్లాడిన తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. విజయవాడ కు చెందిన టీడీపీ నేతలు దురుసుగా డ్రైవింగ్ చేయడం వల్ల ఘర్షణ మొదలైందన్నారు. పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉన్నా టీడీపీ నేతల్ని పంపించడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని విమర్శించారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు దిగతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం నిఘా యాప్‌ను రిలీజ్‌ చేశారని తెలిపారు. కాగా ఎన్నికల కోడ్‌ రాకముందే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిని ప్రారంభించారన్నారు. సాధారణంగా ఎన్నికల్లో సజావుగా జరిగేందుకు నిఘా పెంచాలని ప్రతిపక్షాలు కోరడం చూస్తాం.. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే నిఘా యాప్‌ను తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈసీని కలిసిన వారిలో వైసీపీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి,ఇతర నేతలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు