నాకు చాలా పనులున్నాయి నేను వెళ్తున్నా.. కలెక్టర్

21 Mar, 2016 03:25 IST|Sakshi
నాకు చాలా పనులున్నాయి నేను వెళ్తున్నా.. కలెక్టర్

అపహాస్యం!
 
 1.    నాకు చాలా పనులున్నాయి నేను వెళ్తున్నా.. కలెక్టర్
 2.    నేనూ వెళ్తున్నా.. ఎంపీ శివప్రసాద్
 3.    జెడ్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకుల  నిరసన

 
సకాలంలో ప్రారంభం కాని జెడ్పీ సమావేశం మంత్రి, ఎమ్మెల్సీ జెడ్పీ సమావేశమందిరంలోనే రహస్య మంతనాలు  విసుగు చెంది అలిగి వెళ్లిపోయిన కలెక్టర్, టీడీపీ ఎంపీ బాయ్‌కాట్ చేసిన వైఎస్సారీసీపీ ఎమ్మెల్యే, సభ్యులు
 
అధికారులు, సిబ్బందితోపాటు సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు తమ విధివిధానాలు, ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు. రహస్య మంతనాల్లో మునిగితేలుతూ అసలు విషయాన్ని గాలికొదిలేశారు. ఫలితంగా ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన జెడ్పీ సర్వసభ్య సమావేశం మధ్యాహ్నం 12 గంటలైనా ప్రారంభం కాలేదు. విసుగు చెందిన అధికారపార్టీ ఎంపీ, జిల్లా కలెక్టర్ అలిగి వెళ్లిపోగా, ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఇతర సభ్యులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. మంత్రి బుజ్జగింపులతో మళ్లీ ఎంపీ సమావేశ మందిరంలో ప్రత్యక్షమయ్యారు. మునుపెన్నడూ లేనివిధంగా జెడ్పీ సమావేశాన్నే అపహాస్యం చేయడం విమర్శలకు తావిచ్చింది.
 
 చిత్తూరు (అగ్రికల్చర్):   జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ అంచనా సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు.సమావేశం ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్ సభ్యులకు, అధికారులకు తెలియజేశారు.  దీంతో సమావేశానికి జిల్లాలోని అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు, చంద్రగిరి  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రకటించిన సమయానికి సమావేశానికి హాజ రయ్యారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కాకపోతే సమావేశానికి విచ్చేసిన టీడీపీ సభ్యులు మాత్రం సమావేశ మందిరానికి రాకుండా జె డ్పీ చైర్మన్ చాంబర్‌కు వెళ్ళారు. కొంత సమయానికి విచ్చేసిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కూడా చైర్మన్ చాంబర్‌లోకే వెళ్లారు. సమావేశాన్ని గాలికొదిలి  పెట్టి మంత్రి, టీడీపీ సభ్యులు చైర్మన్ చాంబర్‌లోనే ఇతరులను ఎవరినీ లోనికి రానీయకుండా అంతర్గత వ్యవహారాల్లో మునిగిపోయారు.

 అలిగివెళ్లిన కలెక్టర్
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఉదయం 10.35 గంటలకు హాజరయ్యారు. అయితే అప్పటికి సమావేశం ప్రారంభం కాకపోగా, ఒక్క టీడీపీ సభ్యుడు కూడా సమావేశ మందిరంలో లేరు. ఆయన ఒక్కడే వేదికపై గంట సమయం వేచి చూశారు. 11.25 గంటలకుసమావేశ మందిరంలోకి జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్ విచ్చేయగా, ఇంతవరకు సమావేశం ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ ఆయన్ను ప్రశ్నించారు. జెడ్పీ చైర్‌పర్సన్, మంత్రితోపాటు టీడీపీ సభ్యులందరు చైర్‌పర్సన్ చాంబర్‌లోనే ఉన్నారని సీఈవో తెలిపారు. విసుగు చెందిన కలెక్టర్, తనకు వేరే పనులు ఉన్నాయంటూ అక్కడ నుంచి అలిగి వెళ్లిపోయారు.
 
బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్‌సీపీ
సమావేశానికి ఉదయం 10.25 నిమిషాలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ సభ్యులు హాజరయ్యారు. గంటకు పైగా వేచివున్న తర్వాత, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి సమావేశం ఎందుకు ప్రారంభించలేదని జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్‌ను ప్రశ్నించారు. ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో, నిరసన వ్యక్తం చేస్తూ, బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. జెడ్పీ కార్యాలయం ఎదుట అధికార పార్టీ నిరంకుశ ధోరణిని నిరసిస్తూ కొంత సమయం ధర్నా నిర్వహించారు.
 
విసుగుచెందిన ఎంపీ
చెప్పిన సమయానికి సమావేశం ప్రారంభించక పోగా, చైర్‌పర్సన్ చాంబర్‌లో ఉండడం మంచి పద్ధతి కాదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విసుగు చెందారు. ఆయన కూడా 11.50 గంటలకు అక్కడ నుంచి నిష్ర్కమించి, సమావేశ మందిరం బయట చెట్టు కింద మరికొంత సమయం వేచిచూశారు. అప్పటికీ రాకపోవడంతో అక్కడ నుంచి కారులో బయలుదేరి వెళ్లిపోయారు. అనంతరం 12.15 గంటలకు సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ లేకపోవడాన్ని గుర్తించి, ఫోన్ ద్వారా ఎంపీని బుజ్జగించారు. దీంతో మరికొంత సమయానికే ఎంపీ సమావేశానికి హాజరయ్యారు.
 
ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్‌ను వెయిట్ చేయించారా?
జిల్లా కలెక్టర్‌కు, జెడ్పీ చైర్‌పర్సన్ మధ్య విభేదాలు ఉన్నాయి. చైర్‌పర్సన్ గీర్వాణి ఇదివరలో కలెక్టర్ తీరుపై పత్రికాముఖంగా అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కలెక్టర్‌ను ఉద్దేశపూర్వకంగానే వేచివుండే విధంగా చేశారని సర్వత్రా చర్చనీయాంశమైంది.
 
నిబంధనలకు విరుద్ధంగా సమావేశం : చెవిరెడ్డి
ప్రజా సమస్యలను చర్చించాల్సిన జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహణలో అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. జెడ్పీ సమావేశం  నిర్ణీత సమయం కన్నా రెండు గంటలు  దాటినా ప్రారంభించకపోవడంతో ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ సభ్యులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి, జెడ్పీ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. జిల్లాలోని ప్రజాసమస్యలను చర్చించేందుకు కనీసం మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉందని చెవిరెడ్డి అన్నారు. అయితే అధికార పార్టీ సభ్యులు ప్రకటించిన సమయానికి రాకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో  సమావేశాన్ని నిర్వహించాల్సిన జెడ్పీ సీఈఓ, ఫోరం లేదని తెలుపుతూ కొంతసమయం సభను వాయిదా వేయాల్సి ఉందన్నారు. మరో అరగంటకు కూడా సభ్యులు హాజరుకాకపోతే మరికొంత సమయం వాయిదా వేయాలని, అప్పటికీ హాజరుకాకపోతే సభను మరో రోజుకు వాయిదా వేయాల్సి ఉందన్నారు. అయితే ఇక్కడ  నిబంధనలు ఏమాత్రం పాటించలేదని మండిపడ్డారు. ప్రస్తుత వేసవిలో ప్రజలు, రైతులకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించకుండా అధికార పార్టీ సభ్యులు, అధికారులకు ఉన్న అంతర్గ వ్యవహారాలను చర్చించుకున్నారని దుయ్యబట్టారు.
 
ఏకపక్షంగా బడ్జెట్ ఆమోదం
 
చిత్తూరు (అగ్రికల్చర్) : 2016-17 సంవత్సరానికి గాను జిల్లా బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకపక్షంగా ఆమోదించారు. సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యు లు లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి 40 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించేశారు. జిల్లాలోని అన్ని రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,041,92,76,000 మేరకు బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టారు. జిల్లా ప్రజాపరిషత్ బడ్జెట్ అంచనా సర్వసభ్య సమావేశం ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణీ అధ్యక్షతన అధికారులు నిర్వహిం చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హాజ రయ్యారు. అయితే ఈ సమావేశం ప్రకటించిన సమ యం కన్నా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. టీడీపీ సభ్యులు మాత్రమే హాజ రైన బడ్జెట్ అంచనా సమావేశంలో 2015-16 సంవత్సరానికి గాను రూ.954,82, 62,000 మేరకు ఆదాయం చూపెట్టగా రూ.954,02,42,000 మేరకు వ్యయం అయినట్లు జడ్పీ సీఈఓ పెంచలకిషోర్ ప్రకటించారు. అలాగే  2016-17 సంవత్సరానికి గాను రూ.1,042.35,08,000   మేరకు ఆదాయంగా చూపెడుతూ అందులో రూ.1,041,92,76,000 మేరకు వ్యయం కింద బడ్జెట్ అంచనాలను ఆయన ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు తీర్మానాన్ని ప్రకటించారు. ఏకపక్షంగా జరిగిన ఈ బడ్జెట్ సమావేశం 40 నిమిషాల్లోనే ముగిసింది.  
 

మరిన్ని వార్తలు