అరెస్టులు.. అణచివేతలు

25 Jul, 2018 07:28 IST|Sakshi
్చబేతంచెర్లలో తనను అరెస్ట్‌ చేసేందుకు వచ్చిన పోలీసులను ఇదేం ప్రభుత్వమని ప్రశ్నిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

ప్రత్యేక హోదా..ఐదు కోట్ల మంది హక్కు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశ, శ్వాస. అయితే అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలు ప్రజాకాంక్షను నెరవేర్చలేక పోయాయి. ఇచ్చిన మాట తప్పి ప్రజలను వంచించాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు ఇందుకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ప్రైవేట్‌  పాఠశాలలు ముందుగానే సెలవు ప్రకటించాయి. ప్రజాసంఘాల నాయకులు సైతం సంఘీభావం ప్రకటించారు. బంద్‌ను నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డింది. పోలీసులతో బలవంతంగా అరెస్ట్‌ చేయించింది. వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు బయటకు కదలకుండా గృహనిర్బంధం చేశారు. అయినా జిల్లా వ్యాప్తంగా హోదా కాంక్ష పెల్లుబికింది. ప్రజలు పిడికిళ్లు బిగించి ప్రత్యేక హోదా కావాలంటూ నినదించారు. ర్యాలీలు, రాస్తారోకోలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ను విజయవంతం చేశారు.   

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్‌ను నీరుగార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. హోదా అంటూ రోడ్లపైకి వచ్చిన వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేయాలని ఆదేశించింది. పోలీసు 30 యాక్ట్‌ పేరుతో ధర్నాలు, రాస్తారోలకు అనుమతులు లేవని పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 511 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల్లో మాత్రం హోదాగ్ని రగిలింది. జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, కార్యాలయాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
 
పోలీసు 30 యాక్ట్‌ పేరుతో అరెస్టులు.... 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన రాష్ట్రబంద్‌ను సీఎం చంద్రబాబునాయుడు అణచి వేయాలని పకడ్బందీ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది. అందుకోసం పోలీసు 30 యాక్ట్‌ను వినియోగించుకున్నారు. ఈ యాక్ట్‌ ప్రకారం ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేసేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలి. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బంద్‌కు అనుమతి ఇవ్వమని అడిగినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా బంద్‌లో పాల్గొంటే కేసులు పెడతామని హెచ్చరించారు. కొందరు నాయకులకు రాత్రి నుంచే పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. మామూలుగా రాష్ట్రబంద్‌ల్లో 10–11 గంటల మధ్య ప్రజలకు మరీ ఇబ్బందులు తలెత్తుతాయన్న నేపథ్యంలో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేస్తారు. అయితే ఇప్పుడు మాత్రం ఉదయం ఏడు గంటల నుంచే అరెస్టులు చేయడం మొదలు పెట్టారు.

జిల్లావ్యాప్తంగా 511 మంది వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉదయం 7.10 గంటలకే కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ధర్నా చేస్తున్న కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌లను అరెస్టు చేశారు. ఇక్కడి నుంచి మొదలైన అరెస్టులు ఆగకుండా కొనసాగాయి. బండిఆత్మకూరులో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డిని,  కర్నూలులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డిలను గృహ నిర్బంధం చేశారు.  పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బేతంచెర్లలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టగానే అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి, ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలను అరెస్టు చేశారు. నంద్యాలలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డితోపాటు పలువురు మహిళలను అరెస్టు చేసే సందర్భంలో డీఎస్పీ గోపాలకృష్ణ అనుచితంగా ప్రవర్తించారు.

మహిళలను మగపోలీసులతో ఈడ్చి వేయించడంతో తోపులాట జరిగి కొందరికి రక్తగాయాలయ్యాయి. హోదా కోసం చేస్తున్న ఉద్యమాన్ని సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం దగ్గరుండి పోలీసులతో అణచివేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా కోసం టీడీపీ కూడా «ధర్మ పోరాటాల పేరుతో ప్రభుత్వ ధనంతో సభలు, సమావేశాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఇతర పార్టీల బంద్‌లను నిర్వీర్యం చేయడంలో పరమార్థం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలని వైస్సార్‌సీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య ప్రశ్నించారు.
 
రగిలిన హోదాగ్ని: సీఎం చంద్రబాబునాయుడు ఎన్ని కుట్రలు చేసి హోదా ఉద్యమాన్ని అణచాలని కుట్ర చేసినా.. ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు.   జిల్లాలోని 12 డిపోల్లో 850 బస్సులు ఉండగా.. 350  డిపోలకే పరిమితమయ్యాయి.  ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించుకొని బంద్‌కు సంఘీభావం తెలిపాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్‌ కార్యాలయాలు, సంస్థలు తెరచుకోలేదు. కొన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఎక్కడికక్కడే వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసినా ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన బంద్‌ మాత్రం సంపూర్ణమైంది.  

హోదాకు చంద్రబాబే అడ్డు 
ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా సీఎం చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాలని చూస్తున్నారు. హోదా రావడం చంద్రబాబు ఇష్టం లేనట్టు ఉంది. బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తల అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం.  నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి.. హోదాను పక్కన పెట్టి ఇప్పుడు ఆకస్మాత్తుగా ధర్మ పోరాటాల పేరుతో ప్రజలను దగా చేస్తున్నారు. ఆయన చేస్తే పోరాటం..ఇతరులు చేస్తే పోరాటం కాదా? అరెస్టులతో హోదా ఉద్యమాలను అపలేరు.    – బీవై రామయ్య, 
వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు  

టీడీపీపై నమ్మకం సన్నగిల్లింది 
ప్రత్యేక హోదాతోనే ఏపీ భవిష్యత్‌ ముడిపడి ఉంది. అయితే హోదా రాకుండా టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా అడ్డుకుంటున్నాయి. హోదా ఏమైనా సంజీవనినా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేసి ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో  ప్రజా ఉద్యమం రగలడంతో ముఖ్యమంత్రి యూ టర్న్‌ తీసుకున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది.  – శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

మరిన్ని వార్తలు