నాయకత్వం మారాలి.. అదీ జగన్‌తోనే..

14 Oct, 2018 10:37 IST|Sakshi

సంక్షేమ పాలన కావాలంటే జగన్‌తోనే సాధ్యం

అన్ని వర్గాల ప్రజలనూ బాబు మోసం చేశారు

‘ఎల్లో’ రాతలతో అరచేత వైకుంఠం చూపారు

రాజధాని పేరుచెప్పి రైతులకు ఉరితాడు వేశారు

ప్రజా సమస్యలను పరిశీలించి మ్యానిఫెస్టోగా    

రూపొందించిన జగన్‌కు అవకాశం ఇవ్వాలి

కాకినాడ / జగన్నాథపురం:  అవినీతి ఊబిలో కూరుకుపోయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ మార్పు అవసరమని మేధావులు, ఎన్‌ఆర్‌ఐలు పేర్కొన్నారు. ఆ మార్పు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. స్థానిక డి కన్వెన్షన్‌ హాలులో ‘ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ మార్పు ఎందుకు అవసరం’? అనే అంశంపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. 

ఎన్‌ఆర్‌ఐలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో పాటు వివిధ రంగాల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని రాజకీయాలకు అతీతంగా ప్రస్తుత రాష్ట్రం ఎదుర్కొంటున్న అసమర్థ, అవినీతిపాలనను ఎండగడుతూనే ప్రత్యామ్నాయ నాయకత్వం దిశగా ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధానంగా సమర్థవంతమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తూ సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రజా సంకల్పయాత్ర చేసి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్న జగన్‌ ఈ రాష్ట్రానికి దిక్సూచి కాగలరన్న అభిప్రాయం వివిధ వర్గాల్లో వ్యక్తమైంది.

 సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఆశించి పట్టం కడితే చివరకు ప్రజల ఆశలపై నీళ్ళు చల్లి రాష్ట్ర భవితను అంధకారంలోకి నెట్టారని వక్తలు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు బాబు చేతిలో మోసపోయారన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా నేత కూడా ఈ సమావేశానికి హాజరై డ్వాక్రా సంఘాలను, ఇతర వర్గాలను సర్కార్‌ దగా చేసిన వైనాన్ని ఎండగట్టడం విశేషం.

మా ప్రభుత్వంలో దగా
తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. జన్మభూమి కమిటీ సభ్యురాలిగా, డ్వాక్రా సంఘ నిర్వాహకురాలిగా కూడా ఉన్నా. ఇలాంటి వేదికపై వాస్తవం చెప్పకుండా ఉండలేను. డ్వాక్రా రుణాల రద్దు పేరుతో మహిళలకు అన్యాయం చేశారు. పసుపు కుంకుమలు ఇస్తామంటూ మేము దాచుకున్నడబ్బునే తిరిగి మాకు ఇస్తున్నారు. దీనికి ఎంతో ప్రచారం చేసుకుంటున్నారు. ఎంతో మంది వృద్ధుల వేలిముద్రలు పడక పింఛన్లు ఇవ్వడంలేదు. అలాంటి సొమ్మంతా ఎక్కడికిపోతుందో? ఏమైపోతుందో అర్థంకావడంలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నా మేమేమి మాట్లాడలేకపోతున్నాం. 
– కె.వరలక్ష్మి, యాదవ సంఘ  
మహిళా అధ్యక్షురాలు, టీడీపీ నాయకురాలు

మంచిచేసే పార్టీకే మద్దతు
ఎంతగా మొత్తుకున్నా ఆంధ్రప్రదేశ్‌ను విభజించేశారు. ఆ తరువాత విభజన హామీలు కూడా అమలు చేయకుండా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది. ఇక్కడ పింఛన్‌ విధానాన్నీ తొలగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ, కార్మిక వర్గాలకు మంచి చేసే పార్టీలకే  మా మద్దతు ఉంటుంది. 
– బూరిగ ఆశీర్వాదం, జిల్లా ఎన్‌జీవో సంఘ అధ్యక్షుడు

ఆయనే ఉంటే విభజన అయ్యేది కాదు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి వుంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదు. ఈ సమస్యలూ ఉండేవి కాదు. ప్రస్తుత సర్కార్‌ పింఛన్‌ వి«ధానాన్ని రద్దు చేసి, పదవీ విరమణ చేశాక భద్రత లేకుండా చేస్తోంది. వెయ్యి, రెండు వేలకు ఓట్లు అమ్ముకునే స్థితి కల్పించిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే జగన్‌ నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి. 
– బుద్దరాజు సత్యనారాయణరాజు, 
సీనియర్‌సిటిజన్స్‌ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు

జగన్‌తోనే యువతకు చేయూత
ప్రతిభకలిగిన ఏ విద్యార్థీ విద్యకు దూరంకారాదన్న సంకల్పంతో ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర పథకాలు ప్రవేశపెట్టిన నాటి వైఎస్‌ పాలన మళ్లీ చూడాలంటే జగన్‌తోనే సాధ్యం. 
– డాక్టర్‌ జఫ్రుల్లా, కార్డియాలజిస్ట్, ప్రముఖ వైద్యులు

వీళ్లా మన పాలకులు?
రాజధాని నిర్మాణం, ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దిగమింగుతున్నారు. టీడీపీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు ఐటీ దాడుల్లో వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు, మేధావులు ఆలోచించి ఓటు వేయాలి. ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించి మేనిఫెస్టో తయారు చేస్తోన్న యువనేత జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలి. ప్రజల కోసం పనిచేసే నాయకుడిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తారన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో నెలకొంది. 
– డాక్టర్‌ జి.వెంకటరమణ, సామాజిక కార్యకర్త

స్వేచ్ఛను కోల్పోయాం
రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయాం. అంబేద్కర్‌ ఇచ్చిన స్వేచ్ఛను కూడా కోల్పోయాం, రాష్ట్రం ముక్కలయ్యాక అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పలేదు. . 
– సలీమ్, ముస్లిం ప్రతినిధి

నాయకత్వ మార్పు అవసరం
విద్య, వైద్య, వ్యవసాయంతో సహా అన్ని వర్గాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వమార్పు ఎంతో అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరక్క తల్లిదండ్రులు దిగాలు పడుతున్నారు. సెజ్‌పేరుతో 10వేల ఎకరాలు సేకరించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 
– మలసాని శ్రీనివాసరావు, ఫ్రీలాన్స్‌జర్నలిస్ట్‌

అరచేతిలో వైకుంఠం
సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆయన మాటకు విలువలేని పరిస్థితి నెలకొంది. ప్రతీరోజు చంద్రబాబు మాటలతో మోసపోతూనే ఉన్నాం. వైఎస్‌ బాటలో నడిచే జగన్‌ నాయకత్వాన్ని బలపర్చాలి. 
– ఎంజీకే రాజు, అడ్వకేట్‌

జాబు వస్తుందని నమ్మాం
జాబు కావాలంటే బాబు రావాలన్న ప్రచారాన్నినమ్మి మోసపోయాం. సింగపూర్‌ను చూపించి రైతులను మోసం చేశారు. తాత్కాలిక నిర్మాణాలతో కోట్లు కొల్లగొట్టారు. రైతుల త్యాగాలతో ఆయన అస్మదీయులు కోట్లకు పడగలెత్తారు. ఇలాంటి ప్రభుత్వాలను తరిమికొట్టాలి. జగన్‌ రాకతోనే ప్రజలకు కష్టాలకు విముక్తి. 
– సంజయ్‌కుమార్, నిరుద్యోగి

వైఎస్‌  పాలనలో అన్ని వర్గాలు హ్యాపీ
మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలు, ఉద్యోగులు ఎలాంటి కష్టం లేకుండా గడిపారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పుడు చిరంజీవిని చూడడానికి వచ్చి వైఎస్‌కు ఓట్లు వేసినట్టు, ఇప్పుడు పవన్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు జగన్‌కు ఓట్లు వేసి గెలిపిస్తారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పాలిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా చైతన్యవంతులై  చట్టాలను, రాజ్యాంగాలను గౌరవించే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. 
– కోరా జయరాజు, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌

అనైతిక పొత్తులు
ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసి రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్‌తో టీడీపీ తెలంగాణలో పొత్తులు పెట్టుకోవాలనుకోవడం దిగజారుడుతనమే. ఇలాంటి చర్యలు ద్వారా రాష్ట్ర ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీçస్తున్నారు. మరోవైపు వేలకోట్ల అవినీతితో రాష్ట్రప్రతిష్టను మంటగలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌వంటి యువనాయకత్వంతోనే రాష్ట్రానికి మంచి రోజులు రాగలవు. 
– శ్రీకాంత్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌

రైతులకు ఉరితాడు
ఆంధ్రప్రదేశ్‌కు రాజధానికి కావాలని భూములిచ్చిన రైతులు ఇప్పుడు ఉరితాడుకు వేలాడుతున్నారు. లక్షల కోట్ల అప్పుల్లో ఉండి ఆర్భాటాలతో రోజులు గడుపుతూ రాష్ట్రాన్ని మరింత కుంగదీస్తున్నారు. పేదలకు తినేందుకు తిండి, ఉండేందుకు నీడ లేని పరిస్థితుల్లో మద్యం మాత్రం ఏరులై పారుతోంది. ప్రత్యేక విమానాల్లో ప్రపంచ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుబారాగా ఖర్చు పెడుతున్నారు. 
– వి.హనుమంతరావు, 
విశ్రాంత ప్రిన్సిపాల్, కాకినాడ

జగన్‌తోనే మంచి భవిత
జగన్‌ నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌ పూర్వ వైభవాన్ని సంతరించుకోగలదు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో విద్య, వైద్య, ఆరోగ్యం, శాంతిభద్రతల విషయంలో సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగే బలమైన నాయకత్వం రాష్ట్రానికి అత్యవసరం. అది జగన్‌వల్లే సాధ్యం. 
– హర్షవర్దన్, ఎన్‌ఆర్‌ఐ

కాకి లెక్కలు... ప్రచార ఆర్భాటం
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన కాకి లెక్కలు.. ప్రచార ఆర్భాటంతోనే గడిచిపోయింది. జీడీపీ పేరుతో తప్పుడు లెక్కలు చూపించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా చూపించడం వల్లే రాష్ట్రం ప్రత్యేక హోదా కోల్పోయింది. రాష్ట్రానికి 9వేల కోట్ల పెట్టుడులు వస్తే, 19 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ఎల్లో  మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయి జగన్‌ పగ్గాలు చేపట్టినప్పుడే రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయి. 
– వడిశెట్టి నారాయణరెడ్డి, సైకాలజిస్ట్‌

>
మరిన్ని వార్తలు