వారికి మంత్రి పదవులు సిగ్గుచేటు

3 Apr, 2017 09:17 IST|Sakshi
వారికి మంత్రి పదవులు సిగ్గుచేటు

► ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు
► దమ్ముంటే రాజీనామా చేయించి, గెలిపించి పదవులు కట్టబెట్టు
► వైఎస్సార్‌ సీపీ నేతలు అప్పిరెడ్డి, మేరుగ సవాల్‌
పట్నంబజారు: ‘నోరు తెరిస్తే నిప్పునంటాడు..నీతి నిజాయితీలకు నిలువుటద్దాన్ని అని చెబుతాడు..ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి..రాజ్యాంగానికి..ప్రజాస్వామ్యానికి పాతర వేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్‌ వ్యవహరించిన తీరును నిరసిస్తూ.. ఆదివారం నల్ల రిబ్బన్లు ధరించి అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయం నుంచి లాడ్జిసెంటర్‌లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందన్నారు. అసలు ఎటువంటి పాలన రాష్ట్రంలో సాగుతోందో అర్థం కాని దుస్థితి దాపురిచిందని ధ్వజమెత్తారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక పాలనకు తెరదీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన పేరును దగా బాబుగా మార్చుకుంటే బాగుంటుందని దుయ్యబట్టారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు సర్కార్‌కు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పటం తథ్యమని హెచ్చరించారు.

పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. నాడు గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, ఈ రోజు ఆయన తో రాజ్యాంగానికి తూట్లు పొడిపించారని మండిపడ్డారు. సిగ్గు, ఎగ్గు లేకుండా రాష్ట్రంలో నీఛ రాజకీయాలకు నాంది పలుకుతున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్‌ విసిరారు.  కేవలం లోకేషన్‌ను మంత్రిని చేయడం కోసమే విస్తరణ పేరుతో నీచ రాజకీయానికి పాల్పడ్డారని, లోకేష్‌తోపాటు పదవి ఎరవేసి వైఎస్సార్‌సీపీ నుంచి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలు కొంతమందికి పదవులు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.

నాడు తెలంగాణలో కేసీఆర్‌ తీరుపై ధ్వజమెత్తిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నంది ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పలు విభాగాల నేతలు గనిక ఝాన్సీరాణి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, సోమికమల్, మేరువ నర్సిరెడ్డి, పానుగంటి చైతన్య, షేక్‌ గౌస్, దాసరి కిరణ్, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పల్లపు మహేష్, అందుగల రమేష్, దేవానంద్, సైదాఖాన్, దూపాటి సాల్మన్, హసన్‌బుజ్జి, షంషేర్, జ్యోతి, శివపార్వతి, సుబ్బారెడ్డి, మన్నేపల్లి బాబు, విఠల్, బాజీ, షేక్‌ సుబ్నా, సాయి, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు