అచ్చెన్నాయుడు రౌడీయిజం నశించాలి

16 Feb, 2019 11:51 IST|Sakshi
కోటబొమ్మాళిలో వైఎస్సార్‌ సీపీ నాయకులు చేపట్టిన శాంతియుత ర్యాలీలో  మాట్లాడుతున్న పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌. చిత్రంలో తిలక్, తమ్మినేని, దువ్వాడ

టెక్కలి/కోటబొమ్మాళి: ‘మంత్రి అచ్చెన్నాయుడు రౌడీయిజం నశించాలి.. ఓటు రాజకీయాల కోసం ప్రశాంతమైన కోటబొమ్మాళిను నాశనం చేయాలని చూస్తే సహించం.. మంత్రి, టీడీపీ నాయకులారా ఖబడ్దార్‌.. మీ దౌర్జన్య కాండను ప్రజలంతా గమనిస్తున్నారు.. రాజకీయ కుట్రలు, బరితెగింపు దాడులకు తగిన గుణపాఠం తప్పదు..  వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలోకి చొరబడి మారణాయుధాలతో కార్యకర్తలపై హత్యాయత్నం చేసేలా దాడులకు ప్రేరేపించిన మంత్రి అచ్చెన్నాయుడును ఏ1 ముద్దాయిగా, టీడీపీ మండల నాయకుడు బోయిన రమేష్‌ను ఏ2 ముద్దాయిగా చేర్చాలి..’ అంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేశారు.

కోటబొమ్మాళిలో వైఎస్సార్‌ సీపీ నాయకులు బోయిన నాగేశ్వర్రావుతో పాటు కార్యకర్తలు నేతింటి నగేష్, కాళ్ల సంజీవ్, పిల్లల లక్ష్మణరావు, మెండ తాతయ్య, కాళ్ల ఆదినారాయణ, తోట రమణమూర్తి, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు తదితరులపై టీడీపీ నాయకుల దాడిని నిరసిస్తూ శుక్రవారం కోటబొమ్మాళిలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించి బంద్‌ చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాసు, పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ నాయకులు రెడ్డి నాగభూషణరావు, ధర్మాన కృష్ణచైతన్య తదితరులు హాజరయ్యారు. శాంతియుత ర్యాలీలో టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి మండలాలకు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మంత్రి వైఖరిని ఎండగట్టారు.

పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ..
టీడీపీ నాయకులు దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులతో కలిసి నాయకులంతా వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి కోటబొమ్మాళి, కొత్తపేట వరకు ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు, టెక్కలి సీఐ శ్రీనివాస్‌తో పాటు పెద్ద సంఖ్యలో పోలీస్‌ బలగాలు మోహరించాయి. బంద్‌ చేపట్టేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వైఖరిపై వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. సంత మైదానం వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొంత మంది టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య తగాదా చోటుచేసుకునే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. కాగా, శాంతియుత ర్యాలీ, బంద్‌కు వ్యాపార వర్గాలతో పాటు ప్రజలంతా సహకరించి విజయవంతం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజు, నాయకులు పి.రాజేంద్ర, ఎస్‌.హేమసుందర్‌రాజు, సింగుపురం మోహనరావు, చింతాడ గణపతి, ఎ.రామారావు, డి.వెంకట్రావు, ఆర్‌.ముకుందరెడ్డి, ఆర్‌.రంగారెడ్డి, డి.రామకృష్ణరెడ్డిలతో పాటు కోటబొమ్మాళి, టెక్కలి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రెచ్చగొట్టే పద్ధతి వీడాలి: కృష్ణదాస్‌
దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం లోపలకు చొరబడి అకారణంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసిన సంఘటన సహించరానిదని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాసు అన్నారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ప్రోత్సహించటం వంటి ధోరణి వీడాలన్నారు. ఘర్షణలకు స్వస్తి పలకాలన్నారు.

దాడి అమానుషం: తమ్మినేని
రాజకీయ పార్టీ అంటే సొంత ఇంటిలాంటిæదని, అలాంటి కార్యాలయంపై దాడి చేయటం ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలిపెట్టువంటిదని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. సుమారు 100 మంది టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో వైఎస్సార్‌సీపీ  కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా దాడి చేయడం అమానుషమన్నారు. ఈ విషయంలో పోలీసులు మౌనం వహించటం దురదృష్ట్టకరమన్నారు. అచ్చెన్నాయుడకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి సీఎం చంద్రబాబు పెద్ద తప్పుచేశారన్నారు.  

రాక్షస పాలనకు చరమగీతం పాడాలి: తిలక్‌    
టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేస్తున్న రాక్షస పాలనకు చరమగీతం పాడాలని వైఎస్సార్‌ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ పిలుపునిచ్చారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడిచేయించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. బోయిన సోదరులు ఇలాంటి దుర్మార్గపు వాతావరణాన్ని కల్పించటం సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. 

 గుణపాఠం తప్పదు: దువ్వాడ

1993లో పిన్నింటిపేటలో మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో జరిగిన సంఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ హితవుపలికారు. ప్రజలు తిరగబడి తరిమితరిమి కొట్టిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. తాజా ఘటనలోనూ మంత్రి ప్రమేయముందని ఆరోపించారు. మంత్రి అండతో రెచ్చిపోతున్న బోయిన సోదరులకు తగిన గుణపాఠం తప్పదని, దాడికి బాధ్యులైన వారిని అరెస్టు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు