ఎటు చూసినా మట్టి గుంతలే

8 Dec, 2017 02:45 IST|Sakshi

కానరాని కాఫర్‌ డ్యామ్‌

అరకొరగా కాంక్రీట్‌ పనులు

ఎక్కడి పనులక్కడే.. 

వరప్రదాయిని పోలవరం పరిస్థితి ఇదీ..

ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి,అమరావతి: అరకొర కాంక్రీట్‌ పనులు, అక్కడక్కడా మట్టిపనులు, కానరాని కాఫర్‌ డ్యామ్‌ పనులు ఇదీ గురువారం నాటికి ఆ ప్రాజెక్టు పరిస్థితి.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా కొనియాడుతున్న బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరం పరిస్థితి ఇదీ. 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరగాల్సి ఉంటే అందులో పదోవంతు పనులు మాత్రమే జరిగాయి.. మట్టిని మాత్రం తవ్వుతున్నట్లు కనిపిస్తోంది. కాఫర్‌ డ్యామ్‌ పనులు అసలు ప్రారంభమే కాలేదు.. పోలవరం పూర్తిచేస్తామని నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న గడువు మరో ఆరునెలల్లో పూర్తవుతుంది.

కానీ ఈ ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికావడం సంగతలా ఉంచితే మరో పావుశాతం పనులు కూడా జరిగే అవకాశం లేదు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు అక్కడి పరిస్థితిని చూసి ఓ అంచనాకొచ్చారు. ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నదంతా ఒట్టి బూటకమని, అక్కడ అంత వేగంగా పనులు జరగడం లేదని వారు గమనించారు. రెండురోజుల వరకు అక్కడ ఎలాంటి అలికిడీ లేదు. పనులన్నీ ఆగిపోయాయి.

వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నదన్న సమాచారం నేపథ్యంలో గురువారం అక్కడ మనుషుల అలికిడి, యంత్రాల చప్పుడు మరలా మొదలయ్యింది. వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం, మీడియా బృందాలు అక్కడి నుంచి వెళ్లిపోయే వరకు ఈ హడావుడి ఉంది. ఆ తర్వాత మరలా మామూలే.. పోలవరం ప్రాజెక్టు వద్ద తాము గమనించిన విషయాలను వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాకు వివరించారు..

ముడుపుల కోసమే పోలవరం..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరతప్పిదాలు చేశారని, వాటి వలన ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు వివరించడానికి పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2018లోపు గ్రావిటీతో పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు అందిస్తామని చెబుతూ వచ్చారని, అనేక టీవీ చానళ్లు ఆ పనులను ఎంతో గొప్పగా చూపించాయని, అయితే వాస్తవంగా సైట్‌లోని పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవన్నారు.

కేవలం ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ఆ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ముడుపుల కోసమే కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే 2018 ఎన్నికల్లోపు ఈ ప్రాజెక్టు పనులు ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తికావని, ఈ పనుల పూర్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకువచ్చి, రూ.4,700 కోట్లతో కుడి, ఎడమ కాలువ పనులను పూర్తిచేశారని పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇక్కడ పనులన్నీ కాగితాలపైనే జరుగుతున్నాయన్నారు. వైఎస్‌ జగన్‌ ఈ ప్రాజెక్టు పూర్తికావాలని కోరుకుంటున్నారని,  ధనదాహంతో ప్రాజెక్టును ఆలస్యం చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వచ్చిన అవినీతి డబ్బుతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని తిరుపతి ఎంపీ వరప్రసాదరావు ఆరోపించారు. ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చేపట్టారని, దివంగత వైఎస్‌ ఈ ప్రాజెక్టులోని కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయడమే కాక, నిర్వాసితులకు మంచి ప్యాకేజి అందచేశారని ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్‌ కొనియాడారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఈ బస్సుయాత్రకు వచ్చిన నేతలకు «ధన్యవాదాలు చెప్పారు.   

మరిన్ని వార్తలు