ఈ నెల 22న విశాఖలో మహాధర్నా: బొత్స

17 Jun, 2017 17:23 IST|Sakshi
ఈ నెల 22న విశాఖలో మహాధర్నా: బొత్స

తిరుపతి: చంద్రబాబు సర్కార్‌ భూ దందాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమరభేరి మోగించింది. ఈ నెల 22న విశాఖలో అఖిలపక్షంతో కలిసి మహాధర్నా నిర్వహించనున్నట్లు  ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. భూములు కనిపిస్తే టీడీపీ నేతలు రాంబందుల్లా వాలుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూ కబ్జాలపై తమ పోరాటం ఆగదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

విశాఖలో భూ దందాలు, కబ్జాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌, స్థానిక నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన విమర్శించారు. అలాగే అన్యాయాన్ని నిలదీస్తే ప్రతిపక్షం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని విమర్శలు చేస్తున్నారని బొత్స అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని బొత్స విమర్శించారు.

ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదన్నారు. చంద్రబాబువి మాటలే కానీ, చేతల్లో శూన్యమని ఎద్దేవా చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అలాగే పార్టీ నేత వెల్లంపల్లి నివాసంపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు