జనమే ఎజెండా

14 Apr, 2014 03:39 IST|Sakshi
జనమే ఎజెండా

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోపై  అన్ని వర్గాల నుంచి ప్రశంసలు
 
 న్యూస్‌లైన్ నెట్‌వర్క్ :అన్నదాతకు బాసట.. చేనేతలకు చేయూత.. ప్రభుత్వ ఉద్యోగులకు సొంతింటి కల నెరవేర్చే ప్రణాళిక.. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టే ఆలోచన.. ఆంక్షల్లేని ఆరోగ్య శ్రీ.. మహిళా సంఘాలకు రుణాల నుంచి విముక్తి.. వెరసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. జనమే ఎజెండాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని ‘అనంత’ ప్రజానీకం స్పష్టం చేస్తున్నారు.


 తాను కలలు కంటున్న సువర్ణ యుగాన్ని తెచ్చేలా.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ మేనిఫెస్టో ఉందని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోతో జిల్లాలోని వివిధ వర్గాల వారికి లబ్ధి చేకూరనుంది.

 ‘అమ్మ ఒడి’తో ఉన్నత చదువులు
 నిరు పేద తల్లిదండ్రులు వారి పిల్లలను కూలి పనులకు పంపకుండా బడికి పంపాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టనున్నారు. ఒకటి నుంచి పదో తరగతి పిల్లలకు నెలకు రూ.500 చొప్పున.. ఇద్దరు పిల్లలుంటే నెలకు రూ.1000 చొప్పున తల్లి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.

ఇంటర్ విద్యార్థికి రూ.700, డిగ్రీ, ఆపై చదువులకు రూ.1000 ఇస్తారు. ఈ పథకం వల్ల జిల్లాలో లక్షలాది మంది పిల్లలకు మంచి విద్య అందనుంది. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

 రైతన్నకు బాసట
 ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న సమయంలో.. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించని సందర్భాల్లో రైతులను ఆదుకునేదుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారు. కొత్త ్యవసాయ కళాశాలలు, వెటర్నరీ యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి.

రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఫోన్ చేసిన 20 నిమిషాల్లో రావడానికి మండలానికో 102 మొబైల్ సర్వీస్.. పాడి రైతులు, గొర్రెలు, మేకల కాపరుల సమస్యల పరిష్కారం కోసం 103 మొబైల్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీనివల్ల జిల్లాలోని సుమారు 7 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు.
 
 జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
 జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజనాస్పత్రిలో ప్రస్తుతం రోగుల బాధలు వర్ణణాతీతం. 500 పడకల ఆస్పత్రిగా జీవో జారీ అయినా అందుకు తగ్గ సౌకర్యాలు లేవు. కార్డియాలజీ, యూరాలజీ, న్యూరోలకు ఇక్కడ వైద్యం అందని పరిస్థితి. రక్తమోడుతూ ఎవరైనా ఆస్పత్రికి వెంటనే..

కర్నూలుకో, బెంగళూరుకో రెఫర్ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని జగన్ ప్రకటించడంతో జిల్లాలోని లక్షలాది మంది సామాన్యుల కష్టాలు తప్పనున్నాయి.
 
 నో గ్యాస్‌‘ట్రబుల్’
 వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వడంతో పాటు ఒక్కో సిలిండర్‌పై రూ.100 సబ్సిడీ ఇస్తామని జననేత ప్రకటించారు. జిల్లాలో 5,75,391 లక్షల గ్యాస్ కనెక్షన్‌లున్నాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 441. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ ధరపై రూ.100 తగ్గుతుంది.
 
 కడుపు నిండా భోజనం
 పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కిలో రూ.2 కే బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. 2009లో అధికారంలోకి రాగానే కుటుంబానికి రూ.30 కిలో అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ హామీని తుంగలో తొక్కింది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రతి మనిషికి రూ.1కే ఆరు కిలోల బియ్యం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ నిర్ణయంతో జిల్లాలో 11,53,718 మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
 
 బకాయిల నుంచి విముక్తి

 డ్వాక్రా రుణాల మాఫీ నిర్ణయంతో జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ నిర్ణయంతో జిల్లాలోని 50 వేల స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ.885 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. దీనివల్ల 5.2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.
 
 అభాగ్యులకు ఆసరా
 ఆదరణకు నోచుకోని అభాగ్యులకు ఆసరాగా ఉండేందుకు పింఛన్ మొత్తాన్ని పెంచాలని జననేత నిర్ణయించారు. జిల్లాలో వివిధ పింఛన్‌లు అందుకుంటున్న వారు 4,22,808 మంది ఉన్నారు. వీరిలో 2,30,830 మంది వృద్ధులు. వితంతువులు 1,07,298 మంది ఉన్నారు. చేనేత కార్మికులు 11,966 మంది, గీత కార్మికులు 131 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ. 200 పింఛన్ వస్తోంది.

వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఈ పింఛన్ రూ.700 అవుతుంది. జిల్లాలో వికలాంగులు 55,268 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి నెలకు రూ.500 వస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే వీరికి నెలకు రూ.1000 పింఛన్ లభిస్తుంది. 47,782 మంది వికలాంగులకు రూ.500లు చొప్పున ప్రస్తుతం పింఛన్ పంపిణీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1000 చొప్పున పింఛన్ అందనుంది.  
 
 రెగ్యులరైజేషన్‌తో ఉద్యోగ భద్రత
 ఏళ్ల తరబడి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు భధ్రత కలగనుంది. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే వీరందరూ శాశ్వత ఉద్యోగులుగా మారనున్నారు.
 
 ప్రజల ముంగిట్లో ప్రభుత్వ కార్యాలయాలు

 రేషన్, ఆధార్ కార్డుల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి విసిగిపోతున్నారు. ఈ జన్మలో తమకు కార్డు రాదని, ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీపై నిత్యావసర సరుకులు తీసుకోలేమని భావిస్తున్న కుటుంబాలు జిల్లాలో అనేకం ఉన్నాయి.

ఇలాంటి వారికి భరోసానిచ్చేలా అన్ని రకాల కార్డులను పంపిణీ చేయడానికి ప్రతి గ్రామంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేస్తామని వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంతో బాధిత ప్రజలంతా తమ కష్టాలు తీరినట్లేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆధార్‌కార్డు కోసం 42 లక్షల మంది ఎన్‌రోల్ చేసుకున్నారు. ఇంకా కార్డు తీసుకోని వారు దాదాపు 6 లక్షల మంది ఉంటారు. వీరందరికీ స్థానిక కార్యాలయాల్లో ఉపశమనం కలగబోతోంది.  
 
 చేనేతలకు చేయూత
 వ్యవసాయం, చేనేత రంగం రెండు కళ్లుగా గుర్తించిన వైఎస్ జగన్‌మోహనరెడ్డి తన మేనిఫెస్టోలో చే నేత రంగానికి పెద్దపీట వేశారు.  అధికారంలోకి రాగానే ప్రతి చేనేత కుటుంబానికి మగ్గాల ఏర్పాటుకు షెడ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. బ్యాంకుల్లో తీసుకున్న వ్యక్తిగత రుణాలను మాఫీ చేసి.. ప్రతి చేనేత కుటుంబానికి వడ్డీలేని వ్యక్తిగత రుణాలను అందజేస్తామని పేర్కొన్నారు.

 ప్రస్తుతం 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు ఇస్తున్న రూ.200 పించన్‌ను రూ.1.000 చేస్తానన్నారు. ప్రస్తుతం ముడిసరుకుపై చేనేత కార్మికులకు రూ.600 సబ్సిడీ ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచడంతోపాటు, అన్ని రకాల సబ్సిడీలను పెంచుతామని హామీ ఇచ్చారు. జనతా వస్త్రాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.

 చేనేత వస్త్రాలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు ధరించేలా ప్రోత్సాహం అందిస్తామని, మరమగ్గాలకు కరెంట్ చార్జిలు యూనిట్‌కు రూ. 1.50 మాత్రమే వసూలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 2 లక్షల మందికి లబ్ధి కలగనుంది.

మరిన్ని వార్తలు