‘శారదా స్కాం కంటే పెద్ద కుంభకోణం’

16 Dec, 2018 13:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పశ్చిమ బెంగాల్‌లో శారదా కుంభకోణం జరిగితే కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించిందని, అగ్రిగోల్డ్‌పై ఎందుకు విచారణ జరిపించడం లేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణం శారద స్కాం కంటే రెండింతలు పెద్దదని అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ కీలక సమావేశాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు బాధితులను పట్టించుకోలేదని, ప్రభుత్వ తీరుతో బాధితుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయన్నారు.

కేంద్ర సంస్థతో విచారణ జరిపిస్తే ప్రజలకు న్యాయం జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్కాంలో పెద్దల జోక్యం లేకపోతే విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైవీ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు రూ.1182 కోట్లు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుంభకోణంలో ఉన్న పాత్రధారులపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.  

రాష్ట్రవ్యాప్తంగా పోరాటంను ఉధృతం చేస్తాం: సజ్జల
అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని, ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బాధితులకు అండగా టీడీపీపై పోరాటం చేసేందుకు బాసట కమిటీ రిలే దీక్షలను నిర్వహిస్తుందని, జిల్లా, మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అయినా కూడా ప్రభుత్వంలో స్పందన లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటంను ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి కుట్ర: బొత్స
ఇంతవరకూ అగ్రిగోల్డ్‌ బాధితులకు సంబంధించిన జాబితాను ఎందుకు బయటపెట్టలేదని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి కుట్ర జరుగుతుందని బొత్స.. బాధితులకు బాసటగా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 22, 23 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామన‍్నారు. ఈ నెల 30వ తేదీన కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వందకు వంద శాతం అగ్రిగోల్డ్‌ సమస్యలు పరిష్కరిస్తామన‍్నారు. బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని బొత్స విజ్ఞప్తి చేశారు. 

ఈ నెల 27వ తేదీన ఢిల్లీ వేదికగా వంచనపై గర్జన దీక్ష నిర్వహించబోతున్నామని బొత్స తెలిపారు. దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు చెందిన నాయకులు, నియోజవర్గ సమన్వయకర్తలు హాజరవుతారన్నారు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశామని, వైఎస్‌ జగన్‌ ఆమరణ దీక్ష కూడా నిర్వహించారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడతామన్నారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి  సంజీవని అని బొత్స పేర్కొన్నారు. 

 
 

మరిన్ని వార్తలు