నేత మారినా కదలని కేడర్

20 Apr, 2016 00:22 IST|Sakshi

జగ్గంపేట : ఒక నేత పోతే... వంద మంది పుట్టుకు వస్తారు. తమ స్వార్థం కోసం ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నాయకులపై ప్రజాగ్రహం ఎన్నికల్లోనే తేటతెల్లమవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను టీడీపీలో చేర్చుకోవడంతో జగ్గంపేటలో ఆ పార్టీ పని అయిపోయిందని ప్రచారాన్ని సాగించారు.
 
  వైఎస్సార్ కాంగ్రెస్ జగ్గంపేట నియోజకవర్గంలో సంక్షోభంలో ఉందని చెప్పేవారికి సరైన సమాధానంగా ఆదివారం నియోజకవర్గ స్థాయిలో జగ్గంపేటలో జరిగిన సమావేశం బదులిచ్చింది. పార్టీ సేవాదళ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం స్థానిక కొత్త కొండబాబు కాంప్లెక్స్‌లోని సమావేశపు హాలులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుదారులతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
 
  జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి తొలుత పూలమాల వేసి దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశపు హాలు సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. సమావేశం అనంతరం గ్రామంలో ప్రదర్శన నిర్వహించి మెయిన్ రోడ్డు సెంటర్లోని రాజశే ఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై సమావేశంలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘురామ్ మాట్లాడుతూ పార్టీ మారిన నేత తనకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యం ఇవ్వలేదనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవితోపాటు కీలకమైన సీజీసీ సభ్యత్వం, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పదవిని కట్టబెట్టారన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు చెబుతున్న ఆయన రానున్న మూడేళ్లలో ఎంత మందికి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇస్తారో చూస్తామన్నారు.పార్టీ పురోభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముత్యాల శ్రీనివాస్, వరసాల ప్రసాద్, కర్రి సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు