‘గ్రామ పాలనలో నూతన శకం ప్రారంభమైంది’

2 Oct, 2019 14:48 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : మన జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన నాంది పలికిందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు గ్రామంలో నూతంనంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పాలనలో నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ 150వ జయంతి రోజే.. గ్రామ సచివాయాన్ని ప్రారంభించడం దేశ పౌరురాలిగా తనకు గర్వకారణంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో అధి​కారం చేపట్టిన మూడు నెలల కాలంలోనే సుమారుగా యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించడం అనేది ఒక చరిత్ర అని, ఇది జగనన్న తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం అన్నారు.

గత ప్రభుత్వా హయాంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ అయిన ఉద్యోగాల స్థానంలో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగేది కానీ.. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచలోనే మొదటిసారి అని..ఇది ఒక రికార్డు అని తానేటి వనిత హర్షం వ్యక్తం చేశారు. జగనన్న పాదయాత్రలో యువత కష్టాలను చూసి తమ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలలో భాగంగానే ఈ నియామకాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నియామకాలతో యువతకు చక్కని బంగారు భవిష్యత్తు ఏర్పడిందని చెప్పుకోవచ్చు అన్నారు. మడమతిప్పని... మాట మార్చని జగనన్నపై ఉద్యోగాలు పొందిన యువత, వారి కుటుంబాలు కూడా అభిమానం పెంచుకున్నట్లుగా.. వారి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే తెలుస్తోందని మం‍త్రి అన్నారు.

మరిన్ని వార్తలు