కోర్టు ధిక్కరణపై కేసు వేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే

13 Apr, 2017 09:18 IST|Sakshi
కోర్టు ధిక్కరణపై కేసు వేస్తాం: ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి : తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోషల్‌ ఇన్‌ఫ్యాక్ట్‌ అసెస్‌మెంట్‌ సరిగా జరగలేదని పది రోజుల క్రితం రైతులు కోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. దీనిపై కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడాని ప్రభుత్వం మూడు వారాల గడువు కోరిందనే విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈలోపే భూసేకరణ నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టు ధిక‍్కరణపై  కేసు వేస్తామని ఆర్కే తెలిపారు.  చంద్రబాబు భూ దాహానికి అంతు అనేది లేకుండా పోతోందని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న తాము ఏమైనా చేస్తాం, ఎదురు వస్తే ఎంతటికైనా తెగిస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు.

మూడు పంటల పండే భూమిని వదిలిపెట్టాలని గతంలో న్యాయస్థానం చెప్పినప్పటికీ ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌తో  కోర్టు ధిక్కరణకు  పాల్పడిందన్నారు. కాగా పెనుమాక గ్రామానికి అధికారులు  660.83 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్‌ జారీచేశారు. దీంతో 904 మంది భూ యజమానులు ప్రభావితులు అవుతారని ఆ నోటిఫికేషన్‌లో అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు