‘అందుకే కేశినేని ట్రావెల్స్‌ మూసివేశారు’

10 Apr, 2017 12:24 IST|Sakshi
‘అందుకే కేశినేని ట్రావెల్స్‌ మూసివేశారు’

తిరుపతి : టీడీపీ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్‌ మూసివేత వెనుక పెద్ద మతలబే జరిగిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బ్యాంకుల వద్ద నుంచి వందలకోట్ల అప్పు చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని అన్నారు.

బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా ఎగనామం పెట్టారని, కేశినేని నాని మరో విజయ్‌ మాల్యా అవతారం ఎత్తారని చెవిరెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారన్నారు. బస్సుల పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులతో విజయవాడలో స్టార్‌ హోటల్‌ కడుతున్నారని, కేశినేని బస్సులను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కాగా  శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా కేశినేని ట్రావెల్స్‌ బస్ సర్వీసులను ఆపివేశారు. ఇటీవల రవాణ శాఖ కార్యాలయం వద్ద కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం పట్ల నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు దౌర్జన్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకుని నానితో క్షమాపణలు చెప్పించారు. చంద్రబాబు తనతో బలవంతంగా క్షమాపణలు చెప్పించడంతో అసంతృప్తిగా ఉన్న నాని అలకబూనారు.

కాగా ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా  కేశినేని నాని నిధులు సమకూర్చారు. అంతేకాకుండా టీడీపీ తరఫున ఎంపీకా ఎన్నిక కావడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్వహణ భారంతో పాటు పోటీ పెరగడంతో నష్టాలు పెరిగాయి. దీంతో సుమారు 80 ఏళ్లుగా నిర్వహిస్తున్న కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. 170 కేశినేని ట్రావెల్స్‌ బస్సులను ఇతర ట్రావెల్స్‌ కు అమ్మేశారు. మరోవైపు కేశినేని నాని కార్గో వ్యాపారం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు