మంచి పాలనతోనే విస్తారంగా వర్షాలు

11 Aug, 2019 10:55 IST|Sakshi
రిజర్వాయర్‌ నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్న ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ 

ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

అన్నవరం (తూర్పుగోదావరి) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విస్తారంగా వర్షాలు కురిసి రిజర్వాయర్లు నిండాయని, ఇప్పుడు జగన్‌ పాలనలో వర్షాలు బాగా పడుతున్నానయని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన శనివారం అన్నవరంలోని పంపా రిజర్వాయర్‌ నీటిని ఆయకట్టుకు విడుదల చేసేందుకు వచ్చారు. దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు రిజర్వాయర్‌లోని స్లూయిజ్‌ గేట్లను ఎత్తడంతో పంపా నీరు మెయిన్‌ కెనాల్‌ ద్వారా ఆయకట్టు పొలాలకు పరుగులు తీసింది. దీనిద్వారా తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని 12,500 ఎకరాలకు నీరందుతుంది. అంతకుముందు ఎమ్మెల్యేలిద్దరూ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మ తల్లికి పూజలు చేసి పసుపు, కుంకుమ, పూలు, చీర సమర్పించి హారతి ఇచ్చారు. 

‘పంపా’ అభివృద్ధికి కృషి 
పంపా రిజర్వాయర్‌ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ అన్నారు. పంపా ఆయకట్టులోని 12,500 ఎకరాలకు, అలాగే అన్నవరం దేవస్థానం అవసరాల కోసం రిజర్వాయర్‌లో నిత్యం నీరుండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. ఏలేరు ప్రాజెక్ట్‌ నుంచి లేదా పుష్కర ఎత్తిపోతల పథకం కాలువ నుంచి పంపాకు శాశ్వత ప్రాతిపదికన నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయితే పంపా రిజర్వాయర్‌లో నిత్యం నీరు ఉంటుందన్నారు.

రోజుకు 50 క్యూసెక్కుల నీరు విడుదల
పిఠాపురం డీఈ శేషగిరిరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పంపా ఆయకట్టులోని పొలాల్లో నీరు నిల్వ ఉందన్నారు. అందువల్ల రిజర్వాయర్‌ నుంచి 50 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం విడుదల చేస్తున్నామన్నారు. రైతుల అవసరాన్ని బట్టి నీటి విడుదల పెంచుతామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 99.5 అడుగుల నీరు ఉందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ సామర్లకోట ఈఈ రామ్‌గోపాల్, డీఈ శేషగిరిరావు, పార్టీ నాయకులు వెంకటేష్, నాగం గంగబాబు, శెట్టిబత్తుల కుమార్‌రాజా, రాయవరుపు భాస్కరరావు, కొండపల్లి అప్పారావు, దడాల సతీష్, బొబ్బిలి వెంకన్న, బీఎస్‌వీ ప్రసాద్, అల్లాడ సూరిబాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు