తప్పుదారి పట్టించడానికే బొత్సపై విమర్శలు

17 Feb, 2020 16:12 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌

సాక్షి, భీమవరం: టీడీపీ కర్ర పత్రాలుగా ఎల్లో మీడియా పనిచేస్తుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి అంశంపై పదేపదే మీడియా ముందుకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. తన మాజీ పీఎస్‌ శ్రీనివాస్ పై ఐటీ శాఖ దాడులు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు మీడియా ముందుకు రాలేదన్నారు. చంద్రబాబు నుంచి ఆర్థికంగా ప్యాకేజీ తీసుకున్నారు కాబట్టే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఐటీదాడులపై నోరు మెదపడం లేదన్నారు. (ఐటీ దాడులపై వారు నోరు మెదపరేం..!)

చంద్రబాబు భజనపరులు తమ నాయకుడి మెప్పు కోసం ఐటీదాడులపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. దేవినేని ఐటీ దాడులు గురించి మాట్లాడకుండా బొత్సపై విమర్శలు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజం కోసం మీడియా పనిచేయాలని..కానీ అవినీతి ఆధారాలు లభ్యమైన కూడా చంద్రబాబు తొత్తులుగా కొన్ని పత్రికలు,ఛానెల్స్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు.('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా')

పవన్‌ కల్యాణ్‌ అహంకారి..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని గ్రంథి శ్రీనివాస్‌ అన్నారు. పవన్‌ అవకాశవాది అని.. ప్రజలను మోసగించడంలో చంద్రబాబు వద్ద తర్ఫీదు పొందిన వ్యక్తి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పక్కన కూర్చీ వేసి మరొకరిని కూర్చో పెట్టుకోవడానికి అంగీకరించని అహంకారి పవన్‌ అని విమర్శించారు. సిద్ధాంతాలు మాట్లాడే పవన్‌.. ఆచరణలో మాత్రం పెట్టరని  దుయ్యబట్టారు. తను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని నెలల్లోనే భీమవరంలో వంద పడకల ఆసుపత్రికి తన కుటుంబం తరపున నాలుగు ఎకరాల స్థలాన్ని ఇచ్చామని తెలిపారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు