విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తే సహించం

14 Jul, 2020 18:48 IST|Sakshi

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ తర్వాత వరుస ఘటనలు జరగడం వెనక తనకు వ్యక్తిగతంగా అనుమానాలున్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనల వెనక కుట్ర కోణాలున్నాయేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. (నిర్వాసితులకు చంద్ర‘శాపం’)

చంద్రబాబు, టీడీపీ నేతల తీరు చూస్తుంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ కొట్టి రాజధాని రాకుండా ఆలోచన చేస్తున్నారనే భయం కలుగుతోందన్నారు. ఫార్మా సిటీ ఘటనపై లింగమనేని బ్రదర్స్‌ మాట్లాడిన తీరు చూస్తే ఏదో కుట్ర ఉందేమో అనుమానం కలుగుతోందన్నారు. 2014లో కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వని రైతుల అరటి తోటలను తగులబెట్టి వైఎస్సార్‌సీపీపై నెపం వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఘటన జరిగినా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

‘‘గతం లో చంద్రబాబు సీఎం పదవి కోసం అల్లుడిగా పక్కనే ఇంట్లో ఉంటూ కుట్ర పన్ని, ఎన్టీఆర్ మరణానికి కారకులయ్యారు. ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ‘మనసులో మాట’ పుస్తకంలోనే చంద్రబాబు ఉద్యమం చేయాలంటే 4, 5 బస్సులు తగలబెట్టాలని స్వహస్తాలతో  చంద్రబాబు నైజాన్ని వ్యక్తపరిచారని’’ అమర్‌నాథ్‌ గుర్తుచేశారు.

‘‘శవాల మీద పేలాలు ఏరుకునే రీతిలో చంద్రబాబు ఎక్కడ ఏ ఘటన జరిగితే అందులో దూరిపోయి రాజకీయం చేస్తున్నారు. వరస ప్రమాదాలపై టీడీపీ ఆరోపణలు చేయడం సరికాదు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రజలకిచ్చిన మాట ప్రకారం విచారణ జరిపి దోషులను జైలుకు పంపించాం. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఏ ప్రమాదం జరిగినా దోషులను జైలుకు పంపించారా?. విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బకొట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని’ గుడివాడ అమర్‌నాథ్‌ నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు