‘చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’

30 Aug, 2017 14:00 IST|Sakshi
‘చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’

సాక్షి, కర్నూలు :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. ఉప ఎన్నిక సందర్భంగా సీఎం సహా, మంత్రులు నంద్యాలలో తిష్టవేసి అవినీతి సొమ్మును వెదజల్లి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే ఐజయ్య బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... భూమా నాగిరెడ్డికి పీఏసీ పదవి ఇచ్చి వైఎస్‌ఆర్‌ సీపీ గౌరవించిందని, అయితే చంద్రబాబు భూమాకు ఆశలు కల్పించి పొట్టన పెట్టుకున్నారన్నారు. భూమా నాగిరెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడో ఆ పార్టీకి రాజీనామా చేసుంటే పోటీ పెట్టేవాళ్లం కాదన్నారు. అలా చేయనందునే నంద్యాలలో పోటీ అనివార్యమైందని ఐజయ్య అన్నారు.

అభివృద్ధికి ఓటేశారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని, అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాకే చంద్రబాబుకు నంద్యాల గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. ఓటుకు రూ.5వేలు ఇస్తామని చంద్రబాబే బహిరంగంగా చెప్పినా ఈసీ కేసు పెట్టలేదని ఎమ్మెల్యే ఐజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రాజ్యాంగరీత్యా అది తప్పు అని, చంద్రబాబు సీఎం కాబట్టే కేసులు పెట్టలేదని అన్నారు. టీడీపీ నేతలంతా ఇంటింటికీ ప్రచారం చేస్తూ మీరు ఓటేయకపోతే పెన్షన్ ఆగిపోతుందని ఓటర్లను భయపెట్టారని,  నంద్యాలలో బాబు ఓటుకు రూ.5వేలపైన అవినీతి సొమ్మును వెదజల్లాడని, చీరలు, ముక్కుపుడకలు కుమ్మరించారని ఐజయ్య తూర్పారబట్టారు.

మరిన్ని వార్తలు