కేసుల నుంచి తప్పించుకునేందుకే!

18 Nov, 2018 10:51 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి

సీబీఐ అంటే చంద్రబాబుకు ముచ్చెమటలు

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి 

పొదలకూరు: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం, పోలవరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం, ఓటుకు నోటు కేసుల నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీఐ దర్యాప్తు రాష్ట్రంలో వద్దని జీఓను తీసుకువచ్చినట్టు సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు ఎంపీపీ చాంబర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ దర్యాప్తు అంటే చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని విమర్శించారు.

 సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేయకూడదని జీఓ విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబు నియంతృత్వ పోకడలు ఇలాంటి జీఓల వల్ల బయటపడుతున్నట్టు పేర్కొన్నారు. జగన్‌పై హత్యాయత్నం చేసినప్పటి నుంచి తమ పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రమేయం ఉందని వెల్లడిస్తున్నారని, చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించడానికి వీలులేదని ఉత్తర్వులు ఇవ్వడం పరిశీలిస్తే సుస్పష్టంగా ప్రభుత్వ హస్తం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు. బాబు చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావని, కేంద్ర ప్రభుత్వం ఆయనను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

 అర్థం లేని జీఓల వల్ల ఏమీ కాదని, ప్రభుత్వ పెద్దల బండారం బయటపెడతామన్నారు. టీడీపీ నాయకులు సీబీఐ రాష్ట్రంలో ప్రవేశించేందుకు వీలులేదని నిర్ణయం తీసుకుంటే సరిపోదన్నారు. తాము సుప్రీం కోర్టుకు వెళ్‌లైనా కేసులపై దర్యాప్తు చేయించడం జరుగుతుందన్నారు. ఇలాంటి జీఓలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, నియోజకవర్గ మహిళా ఇన్‌చార్జ్‌ తెనాలి నిర్మలమ్మ, మాజీ ఎంపీపీ నోటి మాలకొండారెడ్డి, నాయకులు అక్కెం బుజ్జిరెడ్డి, కోడూరు ఆనంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కార్యకర్తలకు అండగా ఉంటా
తోటపల్లిగూడూరు: అభిమానం, నమ్మకంతో పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు అండగా నిలుస్తానని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం వెంకన్నపాళెం పంచాయతీలో ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ సముద్రంలో వేట లేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్న మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మత్స్యకారుల జీవితాలు ఆనందమయం కావడం ఖాయమన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన 100 మత్స్యకార కుటుంబాలు
వెంకన్నపాళెం పంచాయతీలో శనివారం సాయంత్రం జరిగిన ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమంలో వెంకన్నపాళెం పట్టపుపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పామంజి నరసింహంతోపాటు 100 మత్స్యకార కుటుంబాలు ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవుల గౌడ్, దువ్వూరు గంగాధరరెడ్డి, దుంపల ఏసోబు, పామంజి సోమయ్య, చెరుకూరు శ్రీనివాసులునాయుడు, ముత్యాల మల్లేశ్వర్, ముత్యాల మహేంద్ర, పామంజి చిన్నమల్లి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు