చంద్రబాబు అరాచకపాలనను తరిమికొడదాం

19 Sep, 2018 10:57 IST|Sakshi

నవరత్నాలతో పేదవారికి సంక్షేమ ఫలాలు

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి  

పొదలకూరు: చంద్రబాబునాయుడు అరాచక పాలనను తరిమికొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఉలవరపల్లి, ప్రభగిరిపట్నం గ్రామాల్లో మంగళవారం రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నవరత్నాలు కరపత్రాలను ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని, స్వయాన మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేయలేదని, చేసే ఉద్ధేశం ప్రభుత్వానికి లేదని ప్రకటించినట్టు గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరచిన నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. 

సూట్‌కేస్‌ కంపెనీలున్నట్టు ఒప్పుకున్నారు
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూట్‌కేస్‌ కంపెనీలు ఉన్నట్టు చెప్పకనే చెప్పాడని అందుకు ఆయన్ను అభినందించాలని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. కంపెనీలను ఏర్పాటుచేసిన విషయం వాస్తమేనని చెప్పడం పరిశీలిస్తే వారు విదేశాలకు డబ్బు తరలించేందుకేనని స్పష్టంగా అర్థం అవుతున్నట్లు తెలిపారు. పొదలకూరు మండలాన్ని సస్యశ్యామలం చేశానని ప్రచారం చేసుకుంటున్న సోమిరెడ్డి మండలంలో ఎవరి సహాయం లేకుండా ఒక్క గ్రామానికి దారి తెలుసుకుని వెళ్లి రాగలడా అని ప్రశ్నించారు. 

పర్వతారోహకుడు రాకేష్‌కు అభినందనలు
ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేసిన గొలగమూడి రాకేష్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం, తన సొంత మండలం పొదలకూరులోని స్వగ్రామం తోడేరు పంచాయతీ శాంతినగర్‌కు చెందిన రాకేష్‌ను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తానన్నారు. రాకేష్‌కు సన్మానసభ ఏర్పాటు చేసి అభినందించడం జరుగుతుందన్నారు. ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు స్మారక స్తూపాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి తెనాలి నిర్మలమ్మ, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు పి.లచ్చారెడ్డి, పి.పోలిరెడ్డి, అక్కెం బుజ్జిరెడ్డి, మాజీ ఎంపీపీ నోటి మాలకొండారెడ్డి, కోడూరు ఆనంద్‌రెడ్డి, డి.వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీలు ఏనుగు శశిధర్‌రెడ్డి, గార్ల పెంచలయ్య, ఎస్‌కే అంజాద్, కొల్లి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తలు