‘మళ్లీ వైఎస్సార్‌ యుగం మొదలైంది’

14 Oct, 2019 13:00 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి యుగం రాష్ట్రంలో మళ్లీ మొదలైందంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకే వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. పెట్టుబడి సాయం కింద రైతుకు రూ. 12500 వేలు సాయం చేస్తూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్న నేత మన సీఎం అన్నారు. ప్రజల్లో సీఎం జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇక రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని, కేవలం ఉనికిని కాపాడుకోవడానికే నెల్లూరులో పర్యటిస్తున్నారని కాకాణి విమర్శించారు. బాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరులో జరిగే రైతు భరోసా కార్యక్రమానికి రైతులంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు