రాజధాని అవినీతి పవన్‌కు తెలియదా: కొలుసు

31 Aug, 2019 17:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై టీడీపీ, జనసేన తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మండిపడ్డారు. రాజధాని రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా ప్రకటించారా? అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసి రాజధానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు ‘గడిచిన ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌ కళ్యాన్‌ కలిసి సంసారం చేశారు. అప్పుడు చంద్రబాబు అవినీతి పవన్‌కు కనిపించలేదా?. టీడీపీ పాలనను ఆయన సమర్థిస్తున్నారా?. ఐదేళ్లలల్లో ఒక్కసారైనా చంద్రబాబును పవన్‌ ప్రశ్నించారా?. కర్నూల్‌ను రాజధానిగా చేయాలని గతంలో పవన్‌ కళ్యాన్‌ కోరినది నిజం కాదా. రాజధానిలో జరిగిన అవినీతి గురించి పవన్‌కు తెలిసినా కూడా ఎందుకు ప్రశ్నించలేదు. లింగమనేని భూములను ఎందుకు భూసేకరణ కిందకు తీసుకోలేదు. ఇసుకను మింగింది టీడీపీ నేతలు కాదా?. ఇసుకను తక్కువ ధరకు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే నిందలు వేస్తారా. ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇసుకను సరఫరా చేస్తున్నాం. అసెంబ్లీలో ఫర్నీచర్‌ మాయంపై చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరు? ’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. 

మరిన్ని వార్తలు