'బ్రాహ్మణ సమాజానికి ఇది అవమానమే'

21 Jun, 2017 11:18 IST|Sakshi
'బ్రాహ్మణ సమాజానికి ఇది అవమానమే'

గుంటూరు: గతంలో ఏపీ ప్రధాన కార్యదర్శి హోదాలో చేసిన ఐవైఆర్ కృష్ణారావు లాంటి వ్యక్తికి సీఎం చంద్రబాబు నాయుడు ఆరు నెలలుగా కలుసుకునే అవకాశం ఇవ్వక పోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ బ్రాహ్మణుల సమస్యలపై మాతో చర్చిస్తే పదవి నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. కృష్ణారావును విమర్శిస్తూ పదవి నుంచి తొలగించడం బ్రాహ్మణ సమాజానికి జరిగిన అవమానమేనని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 'శాసనసభలో ఏకైక బ్రాహ్మణ ఎమ్మెల్యేను నేను. దీంతో కార్పొరేషన్‌కు సంబంధించి కొన్ని సమస్యలపై కృష్ణారావు నాతో చర్చించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేసింది. ఇటీవల ఆయనను నేను కలిసిన సందర్భంగా.. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు ఇస్తామన్నారు. కానీ మూడేళ్లలో ఇచ్చింది మాత్రం కేవలం 125 కోట్లేనని కృష్ణారావు తెలిపారు.

కాపుల ఓట్లే మీరు ఓట్లుగా లెక్కేస్తున్నారు. బ్రాహ్మణుల ఓట్లు మీకు లెక్కలోకి రావా?. 3 ఏళ్లలో ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లలోనూ బ్రాహ్మణులకు అన్యాయమే జరిగింది. ఈ విషయాన్ని ఐవైఆర్ ప్రశ్నించారు. నేను వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేను కావడం, ఆయన నాతో ఈ విషయాలను చర్చించడంతో ఆయనపై కక్ష పెంచుకుని చైర్మన్ పదవి నుంచి అవమానకర రీతిలో తొలగించడం బాధాకరం. విలువలతో కూడిన వ్యక్తి, నిజాయతీగా తన పనిని నిర్వర్తించే అతికొద్ది మందిలో కృష్ణారావు ఒకరు. కేవలం ప్రభుత్వ చర్యలను సమర్థించడమే పనిగా పెట్టుకోవాలని సూచించగా కృష్ణారావు తిరస్కరించారని' కోన రఘుపతి వివరించారు.

మాజీ సీఎం ఎన్టీఆర్‌ను గోచితో చూపిస్తూ వేసిన అసభ్య కార్టూన్లపై ఎలాంటి చర్యలు తీసుకోని చంద్రబాబు.. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపై పోస్టులు పెట్టిన కృష్ణారావుపై వేటు వేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రాజధాని అమరావతి పేరుతో 30 వేల ఎకరాలలో జరిగే వ్యాపార వేడుకలు మాత్రమే పూర్తి రాష్ట్రమని సర్కార్ భ్రమిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించగా, మూడు నెలలు పూర్తవుతున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి లోపాలను ఎత్తి చూపిస్తే చైర్మన్ కృష్ణారావుపై టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా చైర్మన్ పదవి నుంచి తొలగించారు. నిజాయితీపరుడైన కృష్ణారావును తొలగించిన తీరుపై బ్రాహ్మణ సంఘాలు మండి పడుతున్నాయి.