లోకేష్‌ విమర్శలు హాస్యాస్పదం: ఎమ్మెల్యే రోజా

28 Jun, 2020 08:28 IST|Sakshi

సాక్షి, తిరుమల: అధికారం చేపట్టిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద శాతం పథకాలను అమలు చేశారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా శ్రీవారిని భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకున్నానని తెలిపారు. కోవిడ్ టెస్ట్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉందన్నారు. కరోనా చికిత్సను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కిందకి తీసుకొచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా చికిత్సకి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. (అంబులెన్స్‌ వ్యవస్థకు జవజీవాలు)

చంద్రబాబు నాయుడు ఖజానాకి 3.5 లక్షల కోట్లు అప్పు ఉంచి వెళ్ళారని, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూడా ప్రజలను క్లిష్టమైన సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆర్థికంగా ఆదుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ‘నారా లోకేష్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆయన తండ్రి 13 సంవత్సరాలుగా సీఎంగా ఉన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి.. దొంగల్లాగా పారిపోయి మేము బతికుంటే చాలు అన్నట్లు వ్యవహరించారు. టీడీపీలో ఉన్న అవినీతి గద్దలు సాక్ష్యాలతో సహా దొరికి అరెస్ట్‌ అయితే వారి కోసం హైదరాబాద్‌ నుంచి వచ్చారంటూ’ రోజా దుయ్యబట్టారు. చంద్రబాబుకి అధికారం, అవినీతి డబ్బు కావాలే తప్ప, ప్రజలపై అభిమానం లేదని, ఆయన నైజం ఏమిటో ప్రజలందరికి తెలిసిందన్నారు. (టీడీపీ మత్తులో పవన్‌ కల్యాణ్)

‘పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడు. ఆయనను మంగళగిరిలో ఎంత దారుణంగా ఓడించారో చూశాం. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్.. 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యతతో నాయకుడిగా ఎదిగిన వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. దేశంలోనే బెస్ట్‌ సీఎంగా వైఎస్‌ జగన్‌ నాల్గవ స్థానంలో ఉన్నారు. ముందు నారా లోకేష్‌ రాజకీయాలపై అవగాహన తెచ్చుకోవాలంటూ’ రోజా హితవు పలికారు.

మరిన్ని వార్తలు