సాక్షి ఒక్కటే కాదు...మిగతా ఛానల్స్‌ మాటేంటి?

23 Mar, 2017 14:17 IST|Sakshi
సాక్షి ఒక్కటే కాదు...మిగతా ఛానల్స్‌ మాటేంటి?

అమరావతి: అగ్రిగోల్డ్‌ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ... టీడీపీకి మాత్రమే న్యాయం అన్నట్లుగా సమాధానం చెప్పాల్సిన సర్కార్‌ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని విమర్శించారు. తాము అగ్రిగోల్డ్‌ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే ప్రభుత్వం దానిపై ఇవాళ సభలో ప్రకటన చేసిందన్నారు. సభలో స్పీకర్‌ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని మాట్లాడుతున్నారని, ఆయనకు తెలియకుండానే అసెంబ్లీ లోపలి దృశ్యాలను దొంగలించినప్పుడు ఆయన ప్రతిష్టకు భంగం వాటిల్లలేదా అని ప్రశ్నించారు.

మహిళా పార్లమెంట్‌ సదస్సు సందర్భంగా స్పీకర్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌నుకు సాక్షి మీడియా రాలేదని, అయితే ఆ సందర్భంగా స్పీకర్‌ మహిళలపై చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియాతో సహా మిగతా అన్ని ఛానల్స్‌ ప్రసారం చేశాయన్నారు. మరి మిగతా ఛానళ్ల గురించి ఎందుకు ప్రస్తావించలేదని రోజా ప్రశ్నలు సంధించారు. సాక్షి చెబితేనే మిగతా ఛానల్స్‌ ఆ విజువల్స్‌ ప్రసారం చేయడానికి... ఆ ఛానల్స్‌కు సాక్షి మీడియా చుట్టమో, ఫ్రెండో కాదని, వాటికేమీ ‘సాక్షి’  జీతాలు చెల్లించడం లేదని అన్నారు. మిగతా  ఛానళ్ల క్లిప్పింగ్‌లను కూడా సభలో ప్రదర్శించాలని రోజా డిమాండ్‌ చేశారు.

ఒక్క సాక్షి మీడియా గురించే మాట్లాడుతున్నారంటే... నిజాలు ప్రజలకు తెలుస్తున్నాయందునే గొంతు నొక్కేందుకు చూస్తున్నారని అన్నారు. అగ్రిగోల్డ్‌ అంశంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స‍్పందించాల్సి ఉండగా, మధ్యలో అచ్చెన్నాయుడు అత్యుత్సాహంతో కలగచేసుకుని విచారణకు తాము సిద్ధం అంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పుడో జరిగిపోయిన అంశాన్ని ఇప్పుడు తెరమీదకు తెచ్చి అగ్రిగోల్డ్‌ అంశాన్ని పక్కదారి పట్టించారని ఆమె అన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని రోజా పేర్కొన్నారు.