ఎమ్మెల్యేను లేపేయండిరా అంటారా?: రోజా

13 Sep, 2014 11:27 IST|Sakshi
ఎమ్మెల్యేను లేపేయండిరా అంటారా?: రోజా

నగరి : ఒక ఎమ్మెల్యేగా, మహిళగా దేవతకు హారతి ఇవ్వడానికి వెళ్తే దారుణంగా దాడి చేయటంపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఈ దాడిని ఖండిస్తూ రోజాతో పాటు ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన  తెలిపారు. పోలీసులు దాడి చేసిన వారిని పట్టుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై లాఠీచార్జ్‌ చేశారని ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ జాతర జరుగుతోందని, ఎమ్మెల్యే కాక ముందు నుంచి నగరి నియోజకవర్గ ఆడబిడ్డగా ప్రతి సంవత్సరం వచ్చి జాతర చేస్తున్నామన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలిచి... టీడీపీ ఓడిపోయిందన్న కసితో ముద్దుకృష్ణమ నాయుడు, ఆయన కుమారుడు భాను స్థానికుల్ని రెచ్చగొట్టారన్నారు. ప్రతి విషయాన్ని వారు సమస్య చేస్తున్నారని రోజా అన్నారు. ముద్దు కృష్ణమనాయుడు అండతో ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారన్నారు.

అ నేపథ్యంలో తాము శుక్రవారం జాతర చేసుకుంటామని ముందుగా కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. టీడీపీ నేతలు వస్తే గొడవలు జరుగుతాయని తాము వారిని రావద్దన్ని చెప్పామన్నారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామని, కోర్టు ఆర్డర్లో ఎవరు ఎవరూ రాకూడదనే వివరాలు స్పష్టంగా ఉన్నా. వారందర్నీ డీఎస్పీ కృష్ణ కిషోర్ రెడ్డి అనుమతి ఇచ్చారన్నారు. వాళ్లకు ఎందుకు డీఎస్పీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.

హారతి ఇస్తుంటే తన చేతిలో హారతి పళ్ళాన్ని వీఆర్వో జ్యోతిరెడ్డి అలియాస్ సదాశివరెడ్డి లాక్కున్నారని, కింద పడేశారన్నారు. అదే సమయంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడుగా ఉన్న కొడిబాబు అలియాస్ బాబురెడ్డి అమ్మవారి పైకి ఎక్కేసి, తన చేతిని విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడని... అతని చేతిలో కత్తి ఉందో, బ్లేడ్ ఉందో తెలియలేదని, ఆ సమయంలోనే తన చెయ్యి తెగిందన్నారు.

అయినా కూడా అతడిని కిందకు దిగమని బతిమలాడుతున్నారే కానీ, ఒక ఎమ్మెల్యేకు  ప్రాణ హాని ఉందన్నా రక్షణ కల్పించలేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎమ్మెల్యేను లేపేయండిరా తర్వాత మనకు అడ్డం ఉండదు' అని వీఆర్వో వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారో అర్థం అవుతుందన్నారు.

మరిన్ని వార్తలు