హామీల అమలులో వెనుకడుగు వేసేదిలేదు

5 Oct, 2019 18:51 IST|Sakshi

పెనమలూరు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుక అడుగు వేయదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆటో కార్మికులకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం మంజూరు పత్రాలను కంకిపాడు మార్కెట్ కమిటీ యార్డులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. 'ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1,73,531 మంది లబ్దిదారులు ఏడాదికి రూ. 10 వేల చోప్పున అందుకోనున్నారు. 

రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జగన్‌మోహన్‌ రెడ్డి తన సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆటో కార్మికుల గురించి గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఒక్క వైసీపీ మాత్రమే ఆలోచించిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఆటో కార్మికులకు రూ. 10,000 అందించన ఘనత జగన్‌మోహన్‌ రెడ్డిదే' అని అన్నారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే.. వారు రూ.లక్షలు పోసి ఉద్యోగాలు కొనుక్కున్నారని అవమానిస్తున్నారా అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఉద్యోగాలు సాధించిన పిల్లలను చంద్రబాబు అభినందించాలే తప్ప అవమానించ కూడదని హితవు పలికారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు అనిల్ కుమార్, జిల్లా రవాణా శాఖ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు