తోడు నిలిచి.. కన్నీళ్లు తుడిచి!

24 Sep, 2019 08:19 IST|Sakshi

‘‘మాటతప్పని రాజన్నా.. మడమతిప్పని మనిషివయా’’ ఇటీవల వైఎస్సార్‌ జీవిత చరిత్రపై తీసిన ‘యాత్ర’ సినిమాలోని పాట ఇది. ఆయన రక్తాన్నే కాదు.. నడకను, నడతను పుణికిపుచ్చుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా పాలన సాగిస్తున్నారు. అక్కా.. అమ్మా అవకాశం ఇవ్వండి.. రాజన్న పాలన తెస్తానంటూ మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందరికో న్యాయం చేస్తున్నారు. తాజాగా 2016లో డెంగీతో ఇద్దరు పిల్లలను కోల్పోయిన వాజిదా తబస్సుమ్‌కు    సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి మరోసారి మాటతప్పని పాలకుడినని చాటుకున్నారు. 

చేతులెత్తేసిన టీడీపీ
⇒ 2016 సెప్టెంబర్‌ 15: అనంతపురం వినాయకనగర్‌లో నివాసముంటున్న ఎస్‌.వాజిదా తబస్సుమ్, ఎస్‌.ఖలందర్‌ దంపతుల ఇద్దరు కుమారులు మహమ్మద్‌ ఇద్రీస్‌(12), మహమ్మద్‌ జునైద్‌(9)లను డెంగీ కాటేసింది. అపరిశుభ్రత కారణంగా దోమలు ప్రబలి చిన్నారులిద్దరినీ తల్లిదండ్రుల నుంచి దూరం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు డెంగీతో మృతి చెందిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తల్లి వేదన ఎందరినో కన్నీళ్లు పెట్టించింది. 
⇒ 2016 సెప్టెంబర్‌ 16: అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు వాజిదా తబస్సుమ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇల్లు మంజూరు, ఇంట్లో ఒకరికి ఉద్యోగమిస్తామని హామీలిచ్చారు. ఆ కుటుంబం బాధ్యత తమదంటూ ఫొటోలకు ఫోజులిచ్చి మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇందులో ఒక్కటీ అమలు చేయలేకపోయారు. 

మాటకు కట్టుబడిన వైఎస్సార్‌ సీపీ
 2017 డిసెంబర్‌ 11: ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా మదిగుబ్బ క్రాస్‌ వద్ద నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సులో ఎస్‌.వాజిదా తబస్సుమ్, ఎస్‌.ఖలందర్‌లు పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, టీడీపీ తీరును వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. స్పందించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పక ఆదుకుంటామన్నారు. అప్పటి ముఖ్యమంత్రికీ, కలెక్టర్‌కు లేఖ రాస్తాననీ, అప్పటికీ వారు స్పందించకపోతే మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద తబస్సుమ్‌ పేరున రూ.10 లక్షలు మంజూరు చేశారు.  
 2019 సెప్టెంబర్‌ 23:  ఇద్దరు పిల్లలను కోల్పోయిన వాజిదా తబస్సుమ్‌కు రూ. 10 లక్షల చెక్కును సోమవారం గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అందించారు. మాటఇచ్చి నిలుపుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ తల్లి కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. 

సాక్షి, అనంతపురం(గుంతకల్లుటౌన్‌) : అనంతపురం వినాయకనగర్‌లో నివాసముంటున్న ఎస్‌.వాజిదా తబస్సుమ్, ఎస్‌.ఖలందర్‌లకు ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు. వినాయకనగర్‌లో అపరిశుభ్రం కారణంగా ఇద్దరు కుమారులైన మహమ్మద్‌ ఇద్రీస్, మహమ్మద్‌ జునైద్‌ డెంగీతో మృతి చెందారు. పిల్లలిద్దరినీ కోల్పోయిన ఆ దంపతుల వేదన ఎందరినో కలచివేసింది. కానీ అప్పటి టీడీపీ సర్కార్‌ మనస్సు మాత్రం చలించలేదు. సాయం చేస్తామని గొప్పలు చెప్పిన వారంతా ఆ తర్వాత ముఖం చాటేశారు. రెండేళ్లు ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టూ తిరిగిన వాజిదా తబస్సుమ్, ఖలందర్‌ దంపతులు విసిగిపోయి ఆర్థిక సాయంపై ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలోనే 2017 డిసెంబర్‌ 11న ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీల ఆత్మీయ సదస్సు నిర్వహించగా అందులో పాల్గొన్నారు.

తమ వేదనను వినిపించి ఓ అర్జీ అందించారు. స్పందించిన జగన్‌మోహన్‌రెడ్డి ‘‘వాజిదాబేగం నాకిచ్చిన అర్జీని జిల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రికి పంపి సహాయం చేయమని కోరతా. ఈ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం, మానవత్వం ఏ కోశాన ఉన్నా వెంటనే ముందుకొచ్చి సాయం చేయాలి. కానీ నేనొక్కటైతే చెబుతున్నా తల్లీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంతోకొంత సాయమైతే మీకందుతుంది. అదొక్కటే కాకుండా భరోసా ఇచ్చే ఇంకో మాట చెబుతున్నా.. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందజేసే బాధ్యత మాది. మీ కుటుంబానికి తోడుగా ఉంటాం’’ అని హామీ ఇచ్చారు. 

హామీ గుర్తుంది.. ఆర్థికసాయం అందింది 
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఒక్కో హామీ అమలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వాజిదా తబస్సుమ్, ఖలందర్‌ దంపతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఆ చెక్కును గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పంపారు.  

బాలుర తల్లికి చెక్కు అందజేత 
సోమవారం ఉదయం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వాజిదా తబస్సుమ్‌కు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా మంజూరైన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అందజేశారు. వైఎస్‌ జగన్‌ మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి అని వైవీఆర్‌ కొనియాడారు. విద్యావంతురాలైన తబస్సుమ్‌కు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని వైవీఆర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజినేయులు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.వీ.సందీప్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌బాషా, ఎద్దుల శంకర్, మైనార్టీ నాయకులు నూర్‌నిజామి, జాబీర్, ఆర్‌డీజీ.బాషా పాల్గొన్నారు. 

జగనన్నకు రుణపడి ఉంటాం  
నా బిడ్డలు మహమ్మద్‌ ఇద్రీస్, మహమ్మద్‌ జునైద్‌లు డెంగీతో చనిపోయినప్పుడు అప్పటి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు మా ఇంటికి వచ్చారు. బాధలో ఉన్న మమ్మల్ని పరామర్శించి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషి యా, ఇల్లు, ఉద్యోగమిప్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా కోసం మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనికరం చూపలేదు. కానీ అనంతపురానికి వచ్చిన జగనన్నను కలిసి నా గోడు చెప్పుకున్నాను. ఆ రోజు మాట ఇచ్చారు... ఈ రోజు అమలు చేసి చూపాడు. జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– వాజిదా తబస్సుమ్‌  

సాక్షి వరుస కథనాలు 
పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో అనంతపురం నగరంలో అపరిశుభ్రతో పెరిగి డెంగీ, మలేరియా విజృంభించగా.. సాక్షి వరుస కథనాలు ప్రచురించింది. పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇద్రీస్, జునైద్‌ మరణానికి కారణమెవరని ప్రశ్నించింది. కనీసం బాధిత కుటుంబాన్నైనా ఆదుకోవాలని పాలకులకు గుర్తు చేసింది. సెప్టెంబర్‌ 17, 2016లో ‘ఈ పాపం ఎవరిది’ శీర్షికన.. సెప్టెంబర్‌ 17, 2017న ‘నిర్లక్ష్యానికి ఏడాది’ శీర్షికన ‘సాక్షి’ కథనాలతో ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేసింది. కానీ మొద్దనిద్రలో ఉన్న అప్పటి సర్కార్‌ కనీసం స్పందించకపోవడం గమనార్హం.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా