ఎమ్మెల్యే విడదల రజని మరిది కారుపై దాడి

21 Feb, 2020 09:36 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్‌ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో... ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. 

ఈ సందర్భంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే కారులో ఉన్నారని భావించి ఈ ఘటనకు పాల్పడ్డారు. కారులో ఎమ్మెల్యేకు బదులు మీరెందుకు ఉన్నారంటూ మాపై దాడి చేశారు. చిలకలూరిపేటలో మా పుల్లారావు కాకుండా మీరెలా గెలుస్తారని బెదిరించారు. మీ ఎమ్మెల్యే ఎలా తిరుగుతుందో చూస్తాం అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. టీడీపీ నాయకుల దాడిలో మా కారు పూర్తిగా ధ్వంసం అయింది. దాడికి పాల్పడవారిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం’ అని తెలిపారు.

కాపలా కాసి దాడులు చేస్తారా?
టీడీపీ గూండాలను తనను టార్గెట్‌ చేశారని ఎమ్మెల్యే విడదల రజని ఆరోపించారు. 200మందికి పైగా ఒకేసారి దాడి చేశారని, రాళ్లు, రాడ్లతో కారును ధ్వంసం చేశారన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో  ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కాపలా కాసి దాడులు చేయడం కాదని, దమ్ముంటే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజాక్షేత్రంలో గెలవాలని ఎమ్మెల్యే రజని సవాల్‌ విసిరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు