వైఎస్సార్‌ఎల్పీ నేతగా వైఎస్‌ జగన్‌

25 May, 2019 10:30 IST|Sakshi

ఎన్నుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

మధ్యాహ్నం హైదరాబాద్‌ వెళ్లనున్న జగన్‌

గవర్నర్‌తో భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వినతి

30న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. వైఎస్‌ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాక్య తీర్మానం చేశారు.

వైఎస్‌ జగన్‌ని శాసనసభపక్ష నేతగా పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, ఆదిమూలపు సురేష్‌, రాజన్నదొర, బుగ్గన రాజేంద్రనాథ్‌, ముస్తాఫా, ఆళ్ల నాని, ప్రసాదరాజు, కోన రఘుపతి, ఆర్కే రోజా, విశ్వరూప్‌, నారాయణస్వామి బలపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జై జగన్‌ నినాదాలతో సమావేశం మార్మోగిపోయింది. తీర్మానం కాపీని గవర్నర్‌ నరసింహన్‌కు అందజేసేందుకు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌ హైదరాబాద్‌కు బయలుదేరారు.

శాసనసభాపక్ష సమావేశం ముగిసిన తర్వాత అక్కడే వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. తాజాగా లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఈ సమాశంలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా మన అజెండా అని, దీన్ని సాధించేందుకు చిత్తశుధ్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం శ్రమించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

సమావేశం ముగిశాక జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్‌ బయలు దేరతారు. జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అనంతరం విజయవాడలో 30వ తేదీన జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు