రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ

17 May, 2017 02:28 IST|Sakshi
రైతు సమస్యలపై దద్దరిల్లిన అసెంబ్లీ

- నిరసనల మధ్య జీఎస్టీ బిల్లుకు ఆమోదం
- ఏకపక్షంగా మరో బిల్లుకూ ఆమోదముద్ర
- రైతు సమస్యలపై చర్చకు విపక్షం పట్టు
- పోడియంలో వైఎస్సార్‌ సీపీ ఆందోళన
- గందరగోళం మధ్యే సీఎం చంద్రబాబు ప్రసంగం


సాక్షి, అమరావతి: ఒకపక్క రోజురోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు. మరోపక్క గిట్టుబాటు ధరకోసం రోడ్డెక్కుతున్న అన్నదాతలు. రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా అనిపించలేదు. అసెంబ్లీ చేరువలోని కృష్ణానదిలో దూకి ఇటీవలే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నా కళ్లులేని కబోదిలానే ప్రభుత్వం వ్యవహరించింది. రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో గళమెత్తితే.. ఎప్పటిలాగే తమ అధికార బలంతో దానిని నొక్కేసింది. ప్రస్తుతం ధరల పతనంతో అల్లాడిపోతున్న తమను ఆదుకోవడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై ప్రకటన చేస్తారేమో నని ఆశగా ఎదురుచూసిన రైతులకు చివరకు నిరాశే మిగిలింది.

మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీని కేవలం 42 నిమిషాల్లోనే ప్రభుత్వం ముగించింది. జీఎస్టీ బిల్లుతో పాటు మరో బిల్లును ఆమోదించడానికి మాత్రమే పరిమితమైంది.  మంగళ వారం ఉదయం స్పీకరు కోడెల శివప్రసాదరావు సభలోకి ప్రవేశించగానే రైతుల సమస్యలు, మిర్చి, పసుపు అమ్ముకోలేక రైతులు పడుతున్న కష్టాలు, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలపై అత్యవసరంగా చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు ప్రకటించారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పోడియంలోకి వెళ్లి రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘విహార యాత్రల్లో ముఖ్యమంత్రి.. ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు.., మిరప రైతులను ఆదుకోవాలి.

పసుపు రైతుల బాధలు సర్కారుకు పట్టవా? వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రికి రైతుల బాధలెందుకు పడతాయి? మిర్చి రైతుల వ్యతిరేక సీఎం డౌన్‌డౌన్‌.. ఎన్నికల హామీని నెరవేర్చాలి. రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి..’ అంటూ సభ నిరవధికంగా వాయిదా పడేవరకు ప్రతిపక్షసభ్యులు పోడియంలో నినాదాలు కొనసాగించారు. రైతు సమస్యలపై విపక్షసభ్యులు ఇంత ఆందోళన చేసినా ముఖ్యమంత్రి రెండుసార్లు సాగించిన ప్రసంగంలో ఎక్కడా అన్నదాతల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.

విప్లవాత్మక సంస్కరణ: సీఎం
ఆర్థిక సంస్కరణల తర్వాత జీఎస్టీనే విప్లవాత్మక సంస్కరణని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని విపక్ష ఆందోళన, నినాదాల మధ్యే సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రసంగం పూర్తికాగానే స్పీకరు సూచన మేరకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ‘ఆంధ్రప్రదేశ్‌ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)’ బిల్లును ప్రతిపాదించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. గందరగోళం మధ్యే బిల్లు పాసైంది.

సింధుకు డిప్యూటీ కలెక్టరు కోసం చట్ట సవరణ
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టరు పోస్టు ఇచ్చేందుకు వీలుగా చట్టసవరణకు అసెంబ్లీ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సర్వీసుల నియామకాల నియంత్రణ బిల్లును మంత్రి యనమల ప్రతిపాదించగా సభ ఆమోదించినట్లు స్పీకరు ప్రకటించారు.

రైతుల ఇక్కట్లపై నోరు మెదపని పాలకపక్షం
సభ ప్రారంభం నుంచి రైతు సమస్యలపై చర్చించాలని వైఎస్సార్‌ సీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే వచ్చారు. రైతుల ఇక్కట్లపై ప్రకటన చేయడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీపై ఎదురుదాడికి మాత్రం సమయం కేటాయించడం గమనార్హం. విపక్షం విపరీత పోకడలు పోతోందని విమర్శించారు. సంతాప తీర్మానాలు, ఆ వెంటనే బిల్లులు ప్రవేశపెట్టడం, వాటిపై ఒకరిద్దరు మాట్లాడడం, మూజువాణి ఓటుతో ఆమోదించడం అసెంబ్లీలో చకచకా జరిగిపోయాయి.

మరిన్ని వార్తలు