అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశం

17 Aug, 2019 13:18 IST|Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పర్యటిస్తూ.. సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు. సహాయక చర్యల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి నీటి సమస్య, శానిటేషన్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో పశువులకు గడ్డి ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా వాక్సినేషన్‌ టీకాలు వేయ్యాలన్నారు.

ముంపు ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. నష్టపోయిన రైతన్నను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడంలో అధికారులు బాగా కృషి చేశారని పార్థసారథి ప్రశంసించారు.

నందిగామలో పర్యటించిన జగన్‌మోహన్‌ రావు
కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్‌ జగన్‌ మోహన్‌ రావు కంచికచెర్ల, చందర్లపాడు మండలాల్లో పర్యటించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని.. ఏవైనా సమస్యలు ఉంటే (9493530303) కాల్‌ సెంటర్‌ నంబర్‌కు కాల్‌ చేయమని చెప్పారు.

అవనిగడ్డలో పర్యటించిన ఎమ్మెల్యేలు
అవనిగడ్డలోని ఎడ్లలంక, చిరువోలంక, బొబ్బర్లంక, కొత్తపాలెం, ఆముదాలంక గ్రామాల్లో ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్‌ బాబు, ఎంవీఎస్‌ నాగిరెడ్డి పర్యటించారు. ముంపు గ్రామల ప్రజలను పునరావాస కేంద్రాల వద్దకు తరలించి వారికి భోజనంతో పాటు, మెడికల్‌ సహాయ చర్యలు అందించారు. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక డీఎస్పీ, సీఐ, ఎస్సైలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

జేసీ మాదవీలత, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఎన్డీఆర్ ఎఫ్ బోటులో కృష్ణా నది దాటి తోట్లవల్లూరు మండలం పాములలంకకు వెళ్లారు.  ఆ గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్-2 మోహన్ కుమార్, వైయస్ఆర్ సీపీ యువనేత సామినేని ప్రశాంత్ బాబు జగ్గయ్యపేట మండలం రావిరాల, ముక్త్యాల గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు