టీడీపీ నాలుగేళ్లపాలనలో అభివృద్ధి ఏదీ?

29 Apr, 2018 09:27 IST|Sakshi
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హారతులు పట్టి స్వాగతం పలుకుతున్న మహిళలు

12 నెలల్లో రాజన్న రాజ్యం తథ్యం

భవిష్యత్‌ పోరాటాలకు ఇదే ఆరంభ సభ

సత్కార సభలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి

మదనపల్లె : నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఎవరికి మేలు జరిగిందో తెలపాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవిని త్యజించి, ఆమరణ దీక్షల అనంతరం  శనివారం తొలిసారి జిల్లాకు వచ్చిన మిథున్‌ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి అధ్యక్షతన అభినందన, ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. స్థానిక మిషన్‌ కాంపౌండ్‌లో జరిగిన ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పెద్దిరెడ్డి అభిమానులు హాజరయ్యారు. మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మాటలు తప్ప ప్రజ లకు ఒరిగిందేమీ లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, పేదలకు ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో 12 నెలల్లో మనందరికీ మేలు జరుగనుందని, మనందరం కోరుకునే రాజన్న రాజ్యం వస్తుం దని తెలిపారు. చిన్నవయస్సులోనే ఎంపీ అయిన తాను మూడున్నరేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మదనపల్లెలో జరుగుతున్న ఈ సభ భవిష్యత్తులో ప్రజాసంక్షేమం కోసం చేయబోయే పోరాటాలకు ఆరంభమని చెప్పారు. ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రు ల హక్కని, పదవి ముఖ్యం కాదు, ప్రజాసంక్షేమం ముఖ్య మని రాజీనామా చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలి చిన మిథున్‌ రెడ్డిని అభినందిస్తున్నానన్నారు.

ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు చేసింది ధర్మదీక్ష కాదని, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా రూ.30 కోట్ల ఖర్చుతో చేసిన కర్మదీక్షని విమర్శించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్‌మోహన్‌ రెడ్డి కష్టపడుతుంటే.. ఆయన బాటలో నడుస్తున్న మిథున్‌రెడ్డి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ద్వారకనాథ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా చేరిన నాయకుడు పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ సవాళ్లకు బెదిరేది లేదని, దీటుగా సమాధానమిస్తామని హెచ్చరించారు. తంబళ్లపల్లె ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా నని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు జంగాలపల్లె శ్రీనివాసులు, పోకల అశోక్‌ కుమార్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌ గాయత్రీదేవి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, లిడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ రెడ్డెప్ప, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్, షమీం అస్లాం ప్రసంగించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్‌జాన్, ఉదయ్‌కుమార్, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, జరీనా బేగం, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, దేశాయ్‌ జయదేవ్‌ రెడ్డి, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, ఫర్జాన రఫీ, మస్తాన్‌ రెడ్డి, ఖాజా, బాలగంగాధర రెడ్డి, మహమ్మద్‌ రఫీ, వెంకటరమణారెడ్డి, సుగుణాఆంజనేయులు, ముక్తియార్, షరీఫ్, ఎస్‌.ఏ.కరీముల్లా, ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌ రెడ్డి, మల్లికార్జున, మండల ఉపాధ్యక్షుడు ఆనంద పార్థసారధి, సర్పంచ్‌ శరత్‌ రెడ్డి, నాగరాజరెడ్డి, దండు కృష్ణారెడ్డి, చేనేత, వాణిజ్య విభాగం భువనేశ్వరి సత్య, గార్ల చంద్రమౌళి, దండాల రవిచంద్రారెడ్డి, లియాఖత్‌ అలీ, మస్తాన్‌ ఖాన్, సురేంద్ర, మహేష్, రోలింగ్‌ మల్లిక పాల్గొన్నారు. 

వెల్లువెత్తిన ప్రజాభిమానం
మదనపల్లె : ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా మదనపల్లె నియోజకవర్గానికి వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు చేరుకున్న ఆయనకు విమానాశ్రయం నుంచే ఆత్మీయ స్వాగతాలు మొదలయ్యాయి. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకుని సాదరంగా స్వాగతం పలికారు.

అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ఆయనకు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో వేచివున్న వేలాది మంది అభిమానులు పూలవర్షం కురిపించారు. మహిళలు కర్పూర హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 500 వాహనాల్లో అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. వాహనాల వెంబడి బైక్‌లపై ర్యాలీ చేస్తూ జై జగన్, జై మిథున్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

మరిన్ని వార్తలు