టీడీపీ నేతలే భూకబ్జాదారులు

1 Apr, 2018 12:32 IST|Sakshi

అన్యాక్రాంతమైన భూములను పేదలకు పంచేస్తాం

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి

పీలేరు: పీలేరు పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 750 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని,  టీడీపీ నేతలే భూకబ్జాదారులని  రాంజపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పీలేరు పట్టణం ఎర్రమరెడ్డిగుట్టలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలకు సైతం సెంటు స్థలం లేకుండా పీలేరు పట్టణానికి అన్ని వైపులా ఆక్రమణల పరంపర కొనసాగుతోందన్నారు. టీడీపీ నాయకులు అరకొర మిగిలిన వాగులు, వంకలు, 

చెరువులను కూడా ఆక్రమించి లేఔట్లు వేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణకు గురైన భూములన్నింటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచేస్తామన్నారు. భూఆక్రమణలపై కోర్టులో పోరాటం సాగిస్తామని తెలిపారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆక్రమణదారులు ఎంతటి వారైనా, ఎవరినైనా వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంపీపీ డి.హరిత, కేవీపల్లె జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, మండల పార్టీ కన్వీనర్‌ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు చంద్రబాబును నమ్మే స్థితిలో లేరు
పులిచెర్ల(కల్లూరు): తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అన్నారు. కల్లూరులో ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంటును ఆయన ప్రారంభించారు. తొలుత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకోసం నాలుగేళ్లు మీనమేషాలు లెక్కిస్తూ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామనడం ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు.

 ఏప్రిల్‌ 5లోపు హోదాపై హామీ రాకపోతే వైఎస్సార్‌సీపీ ఎంపీలంతా రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి పోరాటం సాగిస్తామన్నారు. అనంతరం కల్లూరులో ముస్లిం మైనారిటీ సోదరులకు రూ.20 లక్షల ఎంపీ నిధులతో మంజూరైన కమ్యూనిటీ హాలుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్, ఎంపీ పి.మురళీధర్, మండల కన్వీనరు మురళీమోహన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ చెంచురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు