సమయం లేదు మిత్రమా..!

29 Nov, 2018 12:58 IST|Sakshi
పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న విజయసాయిరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, రామిరెడ్డి, రామనారాయణరెడ్డి, ప్రసన్న, అనిల్, కాకాణి, సంజీవయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, రామ్‌కుమార్‌రెడ్డి, ఎల్లసిరి

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి

పార్టీ కార్యక్రమాలను మరింతగా  క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లండి

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలకు విజయసాయిరెడ్డి పిలుపు 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘‘సార్వత్రిక ఎన్నికలకు మరి కొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు అందరూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. ప్రజా సమస్యలపై, ప్రజాపక్షాన మరింత అండగా నిలిచి పూర్తిస్థాయిలో పనిచేయాలి’’ అని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని సూచించారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

నెల్లూరు తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయం ఆసన్నమైనందున ప్రతి రోజు విలువైనదేనని ప్రజా సమస్యలపై నిరంతరం క్షేత్రస్థాయిలో బలమైన పోరాటం సాగించాలని సూచించారు. అధికార పార్టీ నీచ రాజకీయాలు సాగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న వైనాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో నూరు శాతం బూత్‌ కమిటీలను పూర్తిచేసి వారిని మరింత క్రియాశీలకంగా పనిచేసేలా సమన్వయకర్తలు వ్యవహరించాలని సూచించారు. పార్టీ అనుబంధ విభాగాలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.
 
నవరత్నాలపై ప్రచారం విస్తృతం చేయండి
పార్టీ ప్రకటించిన నవరత్నాల పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలకు కొద్ది సమయం మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్క సమన్వయకర్త నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు నిరంతం పార్టీ కార్యక్రమాలు జరిగేలా చూసుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అధికారంలోకి రాగానే మంచి ప్రాధాన్యత, గౌరవం ఉంటుందని వివరించారు. నూరుశాతం బూత్‌ కమిటీల ఎంపికలు పూర్తిచేసి రానున్న ఎన్నికల్లో బూత్‌ కమిటీ సభ్యుల సేవలను కీలకంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి సమస్యపై పోరాడడంతో పాటు సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి చేయాలని చెప్పారు. నెల్లూరు తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ప్రజలు భరించలేని స్థితికి వచ్చారని, అన్ని వర్గాలకు బాబు పాలనలో పూర్తి అన్యాయమే జరిగిందన్నారు. ప్రభుత్వ దుర్మార్గ పాలన, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, పార్టీ సమన్వయకర్తలు ఆనం రామ నారాయణరెడ్డి (వెంకటగిరి), నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి (కోవూరు), మేరిగ మురళీ (గూడూరు), బాపట్ల, తిరుపతి పార్లమెంట్‌ పార్టీ పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి  పాల్గొన్నారు. 

జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడు
నెల్లూరు (సెంట్రల్‌): జ్యోతిరావు పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో  బుధవారం జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య,  సమన్వయకర్తలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళి, పార్టీ ముఖ్య నేతలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డితో కలిసి నివాళులర్పించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహాత్మా అని అందరితో పిలుపించుకున్న మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు.
విగ్రహానికి నివాళులు
నగరంలోని మినీబైపాస్‌రోడ్డులో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి వేణుంబాక విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్‌ ద్వారకానాథ్, పి.రూప్‌కుమార్‌తో కలిసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు