‘బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి’

3 Feb, 2018 04:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: దేశంలో 55 శాతానికిపైగా జనాభా ఉన్న బీసీ కులాలకు చట్టసభల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగబద్ధత కల్పించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేందాన్ని కోరింది. ఈ మేరకు రాజ్యసభలో రెండు ప్రైవేటు మెంబర్‌ బిల్లులను శుక్రవారం ప్రవేశపెట్టింది. బీసీలకు జనాభా ప్రాతిపదికన పార్లమెంటు, అసెంబ్లీ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా 330ఏ, 332ఏలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఒక బిల్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరో బిల్లును వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సభలో ప్రవేశపెట్టారు.

బీసీల హక్కుల్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ బిల్లులను ప్రవేశపెట్టినట్టు ఆయన మీడియాకు తెలిపారు. దేశంలో 55 శాతం జనాభా ఉన్న బీసీలు చట్టసభల్లో తగిన స్థాయిలో రిజర్వేషన్లు పొందలేకపోయారని, 2009 లోక్‌సభలో 18 శాతం, 2014లో 20 శాతం మందే చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేస్తూనే.. బీసీలకూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఏపీలో బీసీ జాబితాలో ఉన్న 143 కులాల జనాభా రాష్ట్ర జనాభాలో 56 శాతంగా ఉన్నదని మురళీధరరావు కమిషన్‌ తేల్చిందని చెప్పారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఓబీసీ కమిషన్‌ బిల్లూ ఆమోదం పొందగలదన్న ఆశాభావం వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు