‘రాజకీయాలకు సమయం కాదన్న కనీస స్పృహ లేకుండా..’

7 Apr, 2020 13:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో సమస్త ప్రభుత్వ యంత్రాంగం కంటిపై కునుకులేకుండా కరోనా మహావిపత్తుపై పోరాడుతుంటే పొరుగు రాష్ట్రంలో కూర్చున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కరోనా లెక్కలతో కుస్తీలు పడుతున్నారని వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బురదజల్లుడు రాజకీయాలకు ఇది వేళ కాదన్న కనీస స్పృహ లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వాసుపత్రులను గాలి కొదిలేసి, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించారని ట్విటర్‌లో పేర్కొన్నారు. వాటిపై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తుంగలో తొక్కాడని, ఆరోగ్య శ్రీ కార్డులు ఇతర రాష్ట్రాల్లో చెల్లకుండా చేసి రోగుల ఉసురు తీశారని నిప్పులు చెరిగారు. కమిషన్ల కోసం ప్రజారోగ్య వ్యవస్థను బలి చేశారని పేర్కొన్నారు.
 

మరోవైపు, విశాఖపట్నంలోని సుమారు 15 వేల మంది వాలంటీర్లకి ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్లు, గ్లౌవ్స్ ని విజయసాయిరెడ్డి పంపిణీ చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం 15, 600 మంది వాలంటీర్లకి శానిటైజర్లు, గ్లౌవ్స్ ని అందిస్తున్నామని తెలిపారు. విశాఖ నగరంలో ఉన్న పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుని సోషల్ రెస్పాన్సిబులిటీ కింద 8 లక్షల పేద కుటుంబాలకి అండగా ఉంటామన్నారు. ప్రతీ పేద కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిసిపి రంగారెడ్డి, నార్త్ కన్వీనర్ కెకె రాజు,  వరుదు కళ్యాణి, ట్రస్ట్ సభ్యులు మావూరి వెంకట రమణ, గోపీనాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు