రామయపట్నం పోర్టు ఏర్పాటు చేయండి’

9 Mar, 2017 15:51 IST|Sakshi
రామయపట్నం పోర్టు ఏర్పాటు చేయండి’

న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా రామాయపట్నం ప్రాంతంలో పోర్టు ఏర్పాటుచేసేందుకు అన్ని అనుకూలతలు ఉన్నందున త్వరితగతిన చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో ప్రసంగించారు. ‘ఏపీలో తూర్పు కోస్తా తీరంలో రెండో కేంద్ర ప్రాజెక్టుగా దుగరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం 2013లో నిర్ణయించింది. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో దీనికి యోగ్యత అధ్యయనం పూర్తిచేయాలన్న నిబంధనను కేంద్రం పొందుపరిచింది.

ఏఈకామ్‌ అనే కన్సల్టెన్సీ ఈ యోగ్యత అధ్యయనం పూర్తిచేసి దుగరాజపట్నం పోర్టుకు అనుకూలత లేదని తేల్చింది. విశాఖ పోర్టు ట్రస్టు కూడా ఇదే అంశాన్ని తేల్చింది. చివరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దుగరాజపట్నంపై ముందుకు వెళ్లలేమన్న నిర్ణయానికి వచ్చింది. దుగరాజపట్నం ఆలస్యమవుతున్నందున ప్రధాని ఇచ్చిన హామీ మేరకు ఇదే ప్రాంతానికి 50 కి.మీ. దూరంలో ఉన్న రామాయపట్నం వద్ద పీపీపీ పోర్టును ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది.

చైనా, సింగపూర్‌ తదితర దేశాలు రామాయపట్నం వద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పోర్టు ఏర్పాటుచేస్తే వెనకబడిన ప్రకాశం జిల్లాకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుంది. పోర్టుతో పాటు బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రకాశం జిల్లా అభివృద్ధికి మౌలిక వసతులు ఏర్పాటుచేసినట్లవుతుంది. తగినంత భూమి ఉన్నందున ప్రయివేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా లేదు.

నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ ఎగుమతులు, దిగుమతులకు రామాయపట్నం తగిన ప్రాంతంగా ఉంటుందని నివేదిక ఇచ్చింది. షిప్‌యార్డ్‌గా, పోర్టుగా రామాయపట్నం ఉత్తమ ప్రాంతంగా నిలుస్తుందని కేంద్ర సాంకేతిక నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. సముద్రం లోతుగా ఉన్నందున ఇక్కడ డ్రెడ్జింగ్‌ కూడా అవసరం లేదు. ఐదు కి.మీ. దూరంలోనే రైలు, రోడ్డు నెట్‌వర్క్‌ ఉంది. అందువల్ల త్వరితగతిన రామాయపట్నం పోర్టును ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు